వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన నిర్వాకాలపై కూటమి పాలనలో వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసుల్లో కొందరు అరెస్టు అవుతూ వస్తున్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ముందస్తు బెయిళ్లు తీసుకుంటూ ప్రస్తుతానికి అరెస్టుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. రోజులు గడిచే కొద్దీ ఈ జాబితా పెరిగిపోతూనే ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా చేరిపోయారు.
ఏపీ సీఐడీ అధికారులు సాయిరెడ్డికి సోమవారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు. ఈ బుధవారం ఓ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాలంటూ సదరు నోటీసుల్లో సీఐడీ ఆయనను ఆదేశించింది. కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో ఆ సంస్థ యజమాని కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయిరెడ్డిపై సీఐడీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో సీఐడీ అధికారులు సాయిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించిన విక్రాంత్ రెడ్డి రెండు రోజుల క్రితమే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఈ కేసులో తాను తప్పేం చేయలేదని, తాను బెయిల్ కోరబోనని కూడా సాయిరెడ్డి ప్రకటించారు.
ఇదిలా ఉంటే… వైసీపీ ప్రారంభం అయిన నాటి నుంచి పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి..ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చాలా కాలం పాటు పనిచేశారు. బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలను మెయింటైన్ చేసిన సాయిరెడ్డి… జగన్ అక్రమాస్తుల కేసులకు ఎక్కడికక్కడ కళ్లెం వేయడంలో సఫలీకృతులు అయ్యారన్న వాదనలూ లేకపోలేదు. అయితే వైసీపీ అదికారం నుంచి దిగిపోగా… అనూహ్యంగా సాయిరెడ్డి రాజకీయాలకు సన్యాసం ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానన్న సాయిరెడ్డి… ఇక వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. చెప్పినట్లుగానే సాగు మొదలుపెట్టేసిన సాయిరెడ్డి.. సీఐడీ పోలీసుల నోటీసులకు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.