సంపద సృష్టి అనే పదం విన్నంతనే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే అందరికీ గుర్తుకు వస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించడం, వాటి ద్వారా సర్కారీ ఖజానాకు ఆదాయాన్ని ఆర్జించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వైసీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… సీఎం అధికారిక నివాసం కోసమంటూ విశాఖలోని రిషికొండపై వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంద్రభవనం లాంటి భవన సముదాయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే రెండో సారి సీఎం కావాలన్న జగన్ కల నెరవేరలేదు. ఐదేళ్లతో జగన్ పై విసుగు వచ్చేసిన జనం… టీడీపీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు మరోమారు ఏపీకి సీఎం అయ్యారు.
ఈ క్రమంలో తిరిగి అమరావతికి పూర్వ వైభవం వచ్చేసింది. ఫలితంగా విశాఖలో జగన్ కట్టిన భవన సముదాయం సీఎం అధికారిక నివాసంగా మారే అవకాశం లేదు. మరి ప్రజా ధనంతో నిర్మించిన ఈ భవనాలను ఏం చేయాలి? ప్రజా వేదికను జగన్ కూల్చేసినట్లుగా రిషికొండ భవనాలను చంద్రబాబు కూల్చేయలేదు కదా. మరింకేం చేయాలి? జగన్ దుబారా చేసినా అది ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్ముతోనే నిర్మించిన ఆ భవనాల నుంచి సంపదను సృష్టిద్దామంటూ బాబు తీర్మానం చేశారు.
ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటే లాభసాటిగా ఉంటుందన్న విషయంపై మీమీ అభిప్రాయాలు తెలపండి అంటూ చంద్రబాబు సర్కారు ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లింది. ప్రజలు సూచించిన పలు సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంకో 7 నుంచి 8 లక్షల ఖర్చు చేస్తే… ఈ భవనాలను వినిగించుకునేలా ఏర్పాట్లు జరిగిపోతాయని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు.
ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన ప్రజలు తమకు తోచిన అభిప్రాయాలను ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇటీవలే నేపాల్ హైకమిషనర్ ఒకరు విశాఖ వచ్చినప్పుడు ఆయన ఈ భవనాలను చూసి… అందులో తమ విదేశాంగ శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారట. ఇందుకోసం ఆయన ఏకంగా కేంద్రానికి వినతి పత్రం కూడా సమర్పించారట. ఇందుకు కేంద్రం సరేనంటే…నేపాల్ హై కమిషన్ తో పాటు మరికొన్ని దేశాల హై కమిషన్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.
మిగలిన వాటిలో కొన్నింటిని వాణిజ్య, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకుంటే… ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఓ విద్యావేత్త చెప్పారు. మరొకరు టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలని, ఇంకొకరు అయితే ఓ కన్వెన్షన్ హాల్ గా వినియోగించుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారు. వీటిలో దేనికో ఒకదానికి ఈ భవనాలను ప్రభుత్వం వినియోగించడం ఖాయమే. అంటే జగన్ తన జల్సాల కోసం కట్టారన్న ప్రచారం ఉన్న ఈ భవనాలతో చంద్రబాబు సంపదను సృష్టించడం ఖాయమేనన్న మాట.