రాములమ్మ రీ ఎంట్రీ అదిరిపోయినట్టే

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి రాజకీయాల్లోకి పున:ప్రవేశం అదిరిపోయిందని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన రాములమ్మ… అప్పట్లో మెదక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆమెకు అంతగా కలిసి రాలేదు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఆమెకు అవకాశం దక్కింది. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు దక్కగా .. వాటిలో ఓ స్థానాన్ని పార్టీ అధిష్ఠానం విజయశాంతికి కేటాయించింది. పార్టీ మరో ఇద్దరు అభ్యర్థులు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్ లతో కలిసి సోమవారం ఆమె తన నామినేషన్ ను దాఖలు చేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి ఆమె నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని ఆమె తెలిపారు. ఎవరినో అడుక్కుంటే తనకు సీటు రాలేదని కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ బీసీ మహిళా నేతగా తనకు పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాను పోషించిన పాత్రను గుర్తించిన తర్వాతే పార్టీ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని కూడా విజయశాంతి తెలిపారు. తన సేవలను గుర్తింపుగానే ఎమ్మెల్సీ టికెట్ తనకు దక్కిందన్న రాములమ్మ… ఎమ్మెల్సీ సీటు కోసం తాను ఎవరినీ అడగలేదని కూడా తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధిష్ఠానం… మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటుందో, లేదో తనకు తెలియదని ఆమె ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు.

ఇదిలా ఉంటే… విపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై రాములమ్మ సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ ను ఓడించేందుకే తనను బీజేపీ చేర్చుకుందని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ను ఓడించే వ్యూహంతో సాగుతున్నామని బీజేపీ చెప్పడంతోనే ఆ పార్టీలో చేరానని ఆమె తెలిపారు. అయితే బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఆ రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం గుర్తించిన వెంటనే తాను బీజేపీ నుంచి బయటకు వచ్చానని ఆమె తెలిపారు. అటు కాంగ్రెస్ స్థానిక నాయకత్వంతో తనకు అవసరం లేదన్నట్లుగా మాట్లాడిన రాములమ్మ… ఇటు విపక్షాల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడం ద్వారా తన రీ ఎంట్రీని ఆమె గ్రాండ్ గా చాటుకున్నారన్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.