ఆ ఒక్క మాట కేటీఆర్ ను ఇరికించేసింది!

నిజమే… కేవలం ఒక్క మాట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను అడ్డంగా బుక్ చేసి పారేసింది. బీఆర్ఎస్ అనేది ఫక్తు తెలంగాణ పార్టీ. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ. అలాంటి పార్టీకి చెందిన ఓ కీలక నేతగా ఉంటూ.. కేటీఆర్ ఇతర రాష్ట్రాలను చులకన చేసి మాట్లాడటం… ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాలనలో ఉన్న ఏపీని చులకన చేస్తూ కేటీఆర్ మాట్లాడిన తీరు ఆయనను నిజంగానే బుక్ చేసి పారేసింది.

ఏదున్నా… తెలంగాణలోని రాజకీయ పార్టీలతో పోరాడాలి గానీ… తనకు సంబంధం లేని ఇతర రాష్ట్రాల ప్రస్తావన… ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, పార్టీలకు చెందిన కీలక నేతలను చులకన చేసేలా వ్యాఖ్యలు చేస్తే ఇలాగే ఉంటుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. చివరకు ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయి… తెలంగాణకు మాత్రం రావడం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యపై ఇప్పుడు ఏపీలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని… అయితే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులే రావడం లేదంటూ ఆదివారం కేటీఆర్ సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టారు. రూ.1,700 కోట్ల విలువ చేసే ఓ ప్రాజెక్టు తెలంగాణకు రావాల్సి ఉందని… అయితే ఈలోగానే ఏం జరిగిందో ఆ పెట్టుబడి కాస్తా ఏపీకి తరలిపోతోందని ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనాన్ని తన పోస్టుకు జత చేసిన కేటీఆర్… తెలంగాణ పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపాలని యత్నించారు.

ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు పెట్టుబడులు పోటెత్తుతున్నాయని చెప్పిన కేటీఆర్… ఆఖరుకు ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆ పోస్టులో ఓ పదాన్ని వాడారు. ఇప్పుడు ఆఖరుకు ఏపీ అంటూ కేటీఆర్ వాడిన పదమే ఆయనను అడ్డంగా బుక్ చేసి పారేసిందని చెప్పాలి. కేటీఆర్ పోస్టుపై ఆదివారమే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

తాజాగా ఏపీలోని అధికార పార్టీ టీడీపీకి చెందిన కీలక నేతలు వరుసగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా సోమవారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న… కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబును చులకన చేసే యత్నాలను కేటీఆర్ మానుకోవాలని ఈ సందర్భంగా వెంకన్న సూచించారు. చంద్రబాబును చులకన చేయాలన్న భావనే బీఆర్ఎస్ ను తెలంగాణలో అధికారం నుంచి దించేసిందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబుపైనా… చంద్రబాబు పాలనలోని ఏపీపైనా ఇలాగే విషం చిమ్ముతూ సాగితే… ఇకపై సిరిసిల్లలో కూడా కేటీఆర్ గెలిచే అవకాశం లేదని కూడా బుద్ధా హెచ్చరించారు.

లెక్కలేనన్ని అక్రమాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ నేతలు… తమను తాము చక్కదిద్దుకోవాలని… దానిని వదిలేసి ఏపీపై పడి ఏడుస్తారెందుకని ఆయన ప్రశ్నించారు. ఆఖరులకు ఏపీకి కూడా పెట్టుబడులు వస్తున్నాయన్న కేటీఆర్… అసలు ఏపీకి ఏం తక్కువైందని పెట్టుబడులు రాకుండా పోతాయని బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా సింగిల్ పదం కేటీఆర్ ను అడ్డంగా బుక్ చేసిన వైనంపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది.