ఇంటిని దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడన్న సామెత బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో రుజువు అవుతోంది. వైసీపీకి అనుకూలంగా పనిచేసే అధికారులను బదిలీ చేయడం.. లేదా పక్కన పెట్టడం చేస్తున్న కూటమి సర్కారు .. ఇలా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న అధికారులను కట్టడి చేయలేక పోతున్న విషయం మరోసారి రుజువు అయింది. వివాదాస్పద వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై దూషణలతో విరుచుకుపడిన బోరుగడ్డ అనిల్ కొన్నాళ్ల కిందటే అరెస్టయ్యారు.
ఆ సమయంలో ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత.. తన తల్లికి ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంటూ బెయిల్ పొందారు. అయితే.. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో వైసీపీ నాయకులతో వీడియో కాన్ఫరెన్సు, టెలిఫోన్ కాన్ఫరెన్సులు నెరిపినట్టు తాజాగా వెలుగు చూసింది. ఇదేమంత తేలిక కాదు. గతంలో చంద్రబాబు ఇదే జైల్లో ఉన్నప్పుడు.. ఆయనను ఫోన్ కూడా మాట్లాడకుండా.. నిర్బంధం విధించిన విషయం తెలిసిందే.
కానీ, కరడుగట్టిన బోరుగడ్డ విషయంలో ఈ నిబంధనలు ఏమయ్యాయి? ఆయన వీడియో కాన్ఫరెన్సు మాట్టాడినాపట్టించుకోలేదంటే.. ఏం జరుగుతోందన్న విషయంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం గుర్తించలేనంతగా.. వైసీపీతో లింకు పెట్టుకున్నఓ ఉన్నతాధికారి హస్తం ఉందని అధికారులు గుర్తించారు. అంటే.. ఒకరకంగా.. ఇది ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగానే మారింది. దీంతో ఇప్పుడు వారిని ఏరేస్తారా? లేక.. సర్దుకు పోతారా ? అన్నది చూడాలి. ఏదేమైనా ఈ పరిణామం చంద్రబాబుకు చిక్కుగానే మారిందని అంటున్నారు.