విస్త‌ర‌ణా..? ప్ర‌క్షాళ‌ణా? మంత్రివ‌ర్గంపై చంద్ర‌బాబు ఎక్స‌ర్‌సైజ్ ..!

మంత్రివ‌ర్గ మార్పుపై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఉగాది నాటికి మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ప్ర‌క్షాళ‌న చేయాల‌న్న విధానంపైనా ఆయన దృష్టి పెట్టార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న మంత్రుల్లో ఒక‌రిద్ద‌రిని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేయాలని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త‌ద్వారా ప‌నిచేసే నాయ‌కుల‌కు మాత్ర‌మే త‌న టీంలో చోటు ఉంటుంద‌న్న సంకేతాలు బ‌లంగా ఇవ్వాల‌ని యోచిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 20న ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌లు పూర్తి కాగానే.. వ‌చ్చే ఉగాది నాటికి మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పులు ఖాయ‌మన్న సంకేతాలు ఉన్నాయి. జ‌న‌సేన నాయ‌కుడు నాగ‌బాబును మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటున్న‌ట్టు బాబు చెప్పారు. అయితే.. ఈయ‌న ఒక్క‌రితోనే ప్ర‌స్తుత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఆగిపోద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు నుంచి ముగ్గురి వ‌ర‌కు.. మంత్రుల‌ను మార్చ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

త‌న స‌ర్వేలో వెనుక‌బ‌డిన మంత్రుల‌ను ప‌క్క‌న పెట్టే అవ‌కాశం ఉంది. ఇదేస‌మయంలో బాగా ప‌నిచేస్తున్న ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా కొంద‌రు మంత్రులు.. బాగానే ప‌నిచేస్తున్న నేప‌థ్యంలో వారికి మ‌రింత కీల‌క‌మైన శాఖ‌లు అప్ప‌గించాల‌ని కూడా.. చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇలా మంత్రి వ‌ర్గంలోకి కొత్త‌వారిని తీసుకోవ‌డంతోపాటు, ఉన్న వారిలో ఒక‌రిద్ద‌రిని ప‌క్క‌న పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేస‌మ‌యంలో మంత్రుల‌కు కూడా శాఖ‌లు మార్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే.. దీనిపై క్లారిటీ లేదు. పార్టీ నాయ‌కులు మాత్ర‌మే ఈ విష‌యం చెబుతున్నారు త‌ప్ప‌.. అధినేత నుంచి ఎలాంటి సంకేతాలు రావ‌డం లేదు. కానీ, మార్పు మాత్రం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి.. 9 మాసాలు పూర్త‌వుతోంది. ఉగాది నాటికి 11 మాసాల్లోకి ప్ర‌భుత్వం వెళ్ల‌నుంది. దీంతో ఇంత స్వ‌ల్ప కాలంలోనే మంత్రి వ‌ర్గాన్ని మారుస్తారా? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. దీంతో మంత్రివ‌ర్గ కూర్పు, చేర్పుల‌పై ప్ర‌స్తుతం ఇంకా సందేహాలే కొన‌సాగుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.