తెలంగాణలోని ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు దక్కింది. దీనికి సంబంధించి పార్టీ అదినేత, మాజీ సీఎం కేసీఆర్.. సుదీర్ఘ కసరత్తు చేశారు. చివరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన, ఉన్నత విద్యావంతుడు, మాజీ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్‌కు ఈ టికెట్ కేటాయించారు. ఈయన గెలుపు కూడా ఖాయమనే. దీంతో దాసోజు మండలిలో అడుగు పెట్టనున్నారు. అయితే.. కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు.. దాసోజు ఎంపిక వెనుక చాలా వ్యూహాత్మక అడుగులు వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ సైద్ధాంతిక విధానాలు మారుతున్నాయని, ఉద్యమ నేపథ్యానికి కాంగ్రెస్ పాలకులు గండి కొడుతున్నారని విమర్శిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు దాసోజు ఎంపిక ద్వారా.. మరోసారి తాను తెలంగాణ ఉద్యమ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నానన్న సంకేతాలను బలంగా పంపించినట్టు అయింది. అంతేకాదు.. పార్టీలో వీరవిధేయుడిగా ఉన్న దాసోజు ఎంపిక ద్వారా పార్టీ నేతలకు కష్టిస్తే.. గుర్తింపు లభిస్తుందన్న సంకేతాలను కూడా కేసీఆర్ ఇచ్చారు. ఈ నెల 20న జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పక్ష నాయకులు దాసోజును ఎన్నుకోవాలని.. కేసీఆర్ సూచించారు.
ఎవరీ దాసోజు?
ఉన్నత విద్యావంతుడు అయిన దాసోజు శ్రవణ్.. 2008లో ప్రజా రాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఆ పార్టీలో అనతి కాలంలోనే ఆయన గుర్తింపు పొంది.. పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 2009లో సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అయితే.. అప్పటి తెలంగాణ ఉద్యమం విషయంలో పీఆర్‌పీ తీసుకున్న లైన్‌తో విభేదించిన దాసోజు.. పార్టీకి రాజీనామా చేసి.. కేసీఆర్ సమక్షంలో అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే ఆయనను తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా కేసీఆర్ నియమించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తనకు గుర్తింపు లేకుండా పోవడంతోపాటు.. మరికొన్ని కారణాల వల్ల 2014 ఏప్రిల్ 12న టీఆర్ఎస్ పార్టీని వీడిన దాసోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాదు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయితే.. 2022లో ఆయన కేసీఆర్ ఆహ్వానం మేరకు తిరిగి బీఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ ఎస్ తరఫున బలమైన గళం వినిపిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా ఉన్నారు. తాజాగా ఈయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా.. తిరిగి మూలాలను స్పృశించేందుకు కేసీఆర్‌కు అవకాశం లభించినట్టు అయిందన్న చర్చ సాగుతోంది.