ఏపీ కూటమి పార్టీలు మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు సంబందించి సోమవారం నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ-3, జనసేన-1, బీజేపీ-1 పంచుకున్నాయి. ఈమేరకు ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి(బీజేపీ తప్ప). అయితే.. వాస్తవానికి జనసేన పరిస్థితి ఎలా ఉన్నా.. టీడీపీలో మాత్రం ఈ ఎంపికపై ఆశావహులు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా కొందరు ఫోన్లు స్విచ్చాప్ చేసుకుని అధిష్టానంపై మౌన నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆశావహుల విషయానికి వస్తే.. గత ఎన్నికలకు ముందు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన వారిలో చాలా మంది ఉన్నారు. వీరంతా.. బలమైన నాయకులు కావడం గమనార్హం. అంతేకాదు.. అప్పట్లో సీట్లు త్యాగం చేసిన వారికి చంద్రబాబు స్వయంగా ఎమ్మెల్సీ హామీ కూడా ఇచ్చారన్న ప్రచారం ఉంది.ఇది వాస్తవం కూడా. అయితే.. నెలలు గడిచిపోతున్నా.. ఇప్పటి వరకు తమకు న్యాయం జరగడం లేదని వారు వాపోతున్నారు. మైలవరం నుంచి పోటీ చేయాల్సిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును చంద్రబాబు చివరి నిమిషంలో తప్పించారు.
ఈ టికెట్‌ను వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్‌కు కేటాయించారు. ఈ సమయంలోనే దేవినేనికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చారని అంటారు. అయితే.. ఇప్పటి వరకు ఈ దిశగా చంద్రబాబు పనిచేయలేదు. ఇక, కీలకమైన పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించుకునేందుకు కృషి చేసిన ఎస్‌వీఎస్ వర్మ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయన కూడా.. ఎన్నికల సమయంలో ప్రచారంలోకి కూడా దిగిపోయారు. రేపు మాపో నామినేషన్ కూడా వేస్తారని అనుకున్న సమయంలో అనూహ్యంగా ఆ టికెట్‌ను పవన్ కు కేటాయించారు. ఇప్పటి వరకు ఆయనకు కూడా న్యాయం చేయలేదని వర్మ వర్గం నిప్పులు కక్కుతోంది.
ఇక, కీలకమైన మరో నియోజకవర్గం తిరువూరు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ స్థానం నుంచి మాజీ మంత్రి జవహర్ పోటీకి సిద్ధమయ్యారు. కానీ, గత ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆయనను తప్పించిన చంద్రబాబు ఎక్కడో గుంటూరు నుంచి తీసుకువచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఈ క్రమంలో జవహర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్నారు. కానీ, ఆయనకు కూడా ఇవ్వలేదు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కోడెల శివప్రసాద్ కుటుంబానికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్నా.. ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయారు. సో.. ఇప్పుడు వీరంతా ఆగ్రవేశాలు కక్కుతుండడం గమనార్హం.