ఏపీలో అధికార పక్షంగా ఉన్న జనసేన, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీల మధ్య రాజకీయ వైరుద్ధ్యాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. జీరో స్థాయి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో జనసేన దూకుడు గా ఉంది. పైగా.. కూటమికి అండగా కూడా ఉంది. ఇక, 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయిన వైసీపీ మరింత ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితిలో అనూహ్యంగా రెండు రోజులు గ్యాప్‌లో ఈ రెండు పార్టీలు కూడా.. ఆవిర్భావ వేడుకలకు రెడీ అయ్యాయి.
ఈ నెల 12న వైసీపీ ఆవిర్భావ వేడుకలకు శ్రీకారం చుట్టారు. 2012, మార్చి 12న వైసీపీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అప్పటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి.. వైఎస్ కుమారుడిగా.. జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. అయితే.. 2014లో అధికారంలోకి రావాలని ప్రయత్నించి విఫలమైన ఆయన 2019లో భారీ ఉచిత పథకాలు ఎరవేసి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చారని రాజకీయ ప్రత్యర్థులు చెబుతారు. ఇక, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలతో కునారిల్లుతున్న దశలో వైసీపీ ఉంది.
అయినప్పటికీ.. ఈ నెల 12న ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని పార్టీ తాజాగా ప్రకటన జారీ చేసిం ది. వాస్తవానికి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వ హించింది. కానీ, ఈ దఫా కేవలం క్షేత్రస్థాయిలో నే నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి జగన్ ఎక్కడా హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మీరే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ.. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా జిల్లాల నాయకులకు ఫోన్లు చేసి మరీ చెప్పారు. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
మరోవైపు 21 స్థానాలతో విజయం దక్కించుకున్న జనసేన కూడా.. మరో రెండు రోజుల వ్యవధిలో అంటే.. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ వేడుకలు చేసుకుంటోంది. దీనికి పిఠాపురాన్ని వేదికగా చేసుకున్న ఆ పార్టీ.. అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంగమనార్హం. ఒకప్పుడు జనసేన ఆవిర్భావ వేడుకలను విమర్శించిన వైసీపీ.. ఇప్పుడు తానే విమర్శల్లో కూరుకుపోవడం గమనార్హం. పైగా అధినేత ఎక్కడా వేడుకల్లో కనిపించే అవకాశం కూడా లేదని చెప్పడం మరో విశేషం.