గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అయితే.. ఏపీని ఆర్థికంగా, అభివృద్ది పరంగా ముందుకు నడిపించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థ నిర్వహిం చిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, తెలంగాణలు ఏపీ అవకాశాలు తన్నుకుపోయే అవకాశం ఉందన్న ప్రశ్న కు ఆసక్తికర సమాధానం చెప్పారు. “తెలంగాణకు హైదరాబాద్ వంటి నగరం ఉందని.. మీరు భావిస్తున్నారు. అదేవిధంగా బెంగ ళూరు వంటి నగరం కర్ణాటకకు ఉందని చెబుతున్నారు. ఏపీకి ఏమీ లేకపోవడం అనే మాటే లేదు. ఏపీకి చంద్రబాబు ఉన్నారు. ఆయనను చూసి పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. వచ్చారు” అని తనదైన శైలిలో వ్యాఖ్యానిం చారు.
రాష్ట్రంలో పెట్టుబడుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని లోకేష్ తెలిపారు. సంపద సృష్టి కోసం అనేక ప్రయత్నాలు జరుగుతు న్నాయని లోకేష్ తెలిపారు. అయితే.. రాత్రికి రాత్రి ఏదీ జరిగిపోతుందని అనుకోవడం లేదని.. త్వరలోనే సాకారం అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. కూటమి ప్రభుత్వమే వస్తుందని నమ్మకంగా ప్రజలే చెబుతున్నాని లోకేష్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఏపీ వంటి దక్షిణాది రాష్ట్రాలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్న మాట వాస్తవమేనని చెప్పిన లోకేష్.. అయితే.. దీనిపై ఇప్పుడే తాము ఖంగారు పడిపోవాల్సిన అవసరం లేదన్నారు.
అన్ని విషయాలపైనా కూటమిలో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని నారా లోకేష్ చెప్పారు. అయితే.. నియోజకవర్గాల పునర్విభజనను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారని తెలిపారు. దీనిని తాము ఖండించాల్సిన అవసరం లేకపోయినా.. ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉంటామన్నారు. ఇక, హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదని కూడా నారా లోకేష్ చెప్పారు. మారుతున్నకాలాని అనుగుణంగా ప్రతి ఒక్కరూ బహు భాషా ప్రావీణ్యం పొందాల్సిన అవసరం ఉందన్నారు. భాషతో ఆదాయం కూడా వస్తుందని.. త్వరలోనే ఏఐ సాంకేతికత అందుబాటులోకి రానున్ననేపథ్యంలో భాషా పండితులకు మరింత మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
ఏపీ విషయానికి వస్తే.. మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అయితే.. హిందీని నేర్చుకోవడం తప్పుకాదనితన ఉద్దేశంగా చెప్పారు. పైగా కేంద్రం కూడా జాతీయ నూతన విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినా.. ప్రాథమిక స్థాయిలో మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గుర్తించాలని నారా లోకేష్ సూచించారు. ఏపీ విషయంలో తాము తెలుగుకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు ప్రభుత్వం, ప్రతిపక్షం.. అన్నీ తామేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.