జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జనసేన తరఫున నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ లో తన ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను వెల్లడించాలి కదా. నిబంధనల మేరకు ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో వెల్లడించిన నాగబాబు… తనను తాను మిస్టర్ క్లీన్ గా చెప్పుకున్నారు. తనపై ఒక్కటంటే ఒక్క కేసు కూడా లేదని ఆయన తన అఫిడవిట్ లో వెల్లడించారు. ఇక తన సోదరులతో తనకున్న రుణానుబంధాన్ని కూడా నాగబాబు బయటపెట్టేశారు.
ఆది నుంచి మెగాస్టార్ చిరంజీవితో కలిసి జీవనం సాగించిన నాగబాబు…నటుడిగా, ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఇతరత్రా వ్యాపకాలేమీ లేకుండా సినిమా రంగంలోనే ఆయన సాగారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో గానీ, తమ్ముడు జనసేన స్థాపించిన సమయంలో గానీ.. వారి వెంట ఓ సోదరుడిగా నడిచారే తప్పించి… తాను పెద్దగా ఒంటరిగా సాగిన సందర్భం లేదనే చెప్పాలి. అంతేకాకుండా ఆది నుంచీ సౌమ్యుడిగానే ముద్ర పడిన నాగబాబు ఒకరిని దూషించింది లేదు…లేదంటే ఇతరులతో విమర్శించుకోవాల్సిన అవసరం కూడా ఆయనకు రాలేదనే చెప్పాలి. మొత్తంగా వివాద రహితుడిగానే నాగబాబు సాగారు. ఈ కారణంగానే ఆయనపై ఇప్పటిదాకా సింగిల్ కేసు కూడా నమోదు కాలేదు. ఇదే విషయాన్ని ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
సినిమా నిర్మాణంలో మంచి లాభాలే ఆర్జించిన నాగబాబు…ఆ తర్వాత ఆటుపోట్లను కూడా చవిచూశారు. అయితే మరీ కుటుంబం రోడ్డున పడేంత నష్టాలను ఆయన చవిచూడలేదనే చెప్పాలి. ఫ్యామిలీ బంధానికి బద్ధుడిగా సాగిన నాగబాబు ఫ్యామిలీని ఏనాడూ ఆర్థిక సమస్యల్లో చిక్కుబడనీయలేదు. ఇక తన ఆస్తులను రూ.70 కోట్లుగా పేర్కొన్న నాగబాబు.. అందులో రూ.11 కోట్ల స్థిరాస్తులు, రూ.59 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇక తనకు అప్పులూ ఉన్నాయని పేర్కొన్న నాగబాబు… అన్న చిరంజీవి వద్ద రూ.28.48 లక్షలు, తమ్ముడు పవన్ వద్ద రూ.6.9 లక్షలు అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు ఖాతాలతో పాటుగా బ్యాంకుల్లో అప్పులు కలిపి మొత్తం రూ.1.64 కోట్ల మేర అప్పులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.