ఒకే రోజు రెండు పనులు అప్పజెప్పిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో భయం అంతకంతకూ పెరిగిపోతోందన్న వాదనలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు ఈ వాదనను ఎంతగా కొట్టివేస్తున్నా… జగన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలే ఆయనలోని భయాన్ని బయటపెడుతున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో తాడేపల్లిని వదిలి వెళ్లేందుకు ససేమిరా అన్న రీతిలో సాగిన జగన్…ఇప్పుడు తాడేపల్లి ఇంటిలో క్షణం ఒక యుగం మాదిరిగా ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే… బెంగళూరు నుంచి ఇలా వస్తున్న జగన్… అలా ఒకటో, రెండో రోజులు ఉండటం .. ఆ వెంటనే తిరిగి బెంగళూరు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఈ తరహా వైఖరి జగన్ లో నిజంగానే కొత్తదనే చెప్పాలి.

తాజాగా జగన్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని చూస్తుంటే…తాను పిలుపు ఇస్తే..కేడర్ నుంచి పెద్దగా స్పందన రాకపోవచ్చన్న అనుమానం ఆయన నిర్ణయంలోనే విస్పష్టంగా కనిపించింది. ఈ నెల 12న వైసీపీ ఆవిర్భావ వేడుకలు జరగాల్సి ఉంది. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా… 2011లో ఇదే నెల 12న వైసీపీ పేరిట జగన్ కొత్త పార్టీని ప్రకటించారు. ఈ లెక్కన పార్టీ స్థాపించి ఈ ఏడాది 12 నాటికి 14 ఏళ్లు పూర్తి కానుంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా… అధికారంలో ఉన్నా కూడా ఏటా పార్టీ ఆవిర్భావ వేడుకలను నేతలు ఘనంగా నిర్వహించేవారు. అయితే ఎందుకనో గానీ… ఈ ఏడాది ఆ వేడుకలు కళ తప్పేలానే కనిపిస్తున్నాయి. జగన్ తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగానూ నిలుస్తోంది.

ఈ నెల 12న పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని జగన్ తరఫున పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్కడితో ఆగని ఆయన…అదే రోజున ఫీజు పోరు ఆందోళనలు కూడా చేపట్టాలని సూచించారు. ఉదయం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనొ..ఆ తర్వాత ఫీజు పోరు ఆందోళనలకు దిగాలని ఆయన పార్టీ కేడర్ కు పిలుపు ఇచ్చారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. అంటే… పార్టీ ఆవిర్భావ వేడుకల రోజే పీజు పోరు ఆందోళనలు నిర్వహించాలన్న మాట. ఈ నిర్ణయం నిజంగానే వైసీపీ శ్రేణులను ఒకింత షాక్ కు గురి చేశాయని చెప్పాలి. పార్టీ ఆవిర్భావ వేడుకల వేళ… ఫీజు పోరు నిరసనలేమిటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ తరహాలో జగన్ తీసుకున్న వ్యూహంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావ వేడుకలంటే జనం ఓ మాదిరిగానే బయటకు వస్తారని.. అదే ఎప్పుడో నిర్వహించాల్సిన ఫీజు పోరుకు అంతగా ప్రతిస్పందన ఉండదని జగన్ భావిస్తున్నారట. పలితంగా పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే ఫీజు పోరుకు స్పందన అంతంతమాత్రంగానే వస్తే… పరువు పోతుందని భావించిన జగన్… దానిని పార్టీ ఆవిర్భావ వేడుకల రోజే నిర్వహించాలని తీర్మానించారట. ఎలాగూ పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం వచ్చే జనాన్ని… ఆ కార్యక్రమం తర్వాత అటు నుంచే అటే నిరసనలకు తరలిస్తే సరిపోతుందన్న దిశగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.