రాజకీయాల్లో ఎవరు ఉన్నా.. పదువులు ఆశించకుండా ఉండరనేది నిష్టుర సత్యం. ఎలాంటి పదవులు లేకుండానే ప్రజలకు సేవ చేస్తామని చెప్పేవారు కూడా ఇటీవల కాలంలో కరువయ్యారు. పైగా.. ఏ పార్టీలో ఉన్నా పదవుల కోసమే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వస్తే.. దానికి అనుకూలంగా మారుతున్న వారు పెరుగుతున్నారు. తాజగా గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ నటి, రాములమ్మగా పేరొందిన విజయశాంతి కూడా ఇప్పుడు పదవుల వేట ప్రారంభించారు.
తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం రెడీ అయింది. వీటిలో 3 స్థానాలు ఏక పక్షంగానే కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి ఫైట్ చేస్తే దక్కేదిగా భావిస్తున్నారు. మరొకటి బీఆర్ఎస్‌కు దక్కనుంది. ఎమ్మెల్యేల మద్దతుతో దక్కే ఈ కోటాకు ఇప్పటికే నాయకులు రెడీ అయ్యారు. తమకు కావాలంటే తమకు కావాలంటూ.. నాయకులు పోటీ పడుతున్నారు. ఇలాంటి వారిలో రాములమ్మ ఒకరు. అందరికన్నా ముందుగానే ఆయన చక్రం తిప్పుతున్నారు.
తాజాగా కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలతో రాములమ్మ ముచ్చటించినట్టు సమాచారం. నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన రాములమ్మ.. తనకు ఒక స్థానం ఇవ్వాలని కోరినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం ఢిల్లీలో విజయశాంతి మంతనాలు చేస్తున్నారని.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆమె కలుసుకున్నారని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని కోరినట్టు సమాచారం అందిందన్నారు.
అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీకి గతంలో తాను చేసిన సేవలను, త్యాగాలను పరిగణనలోకి తీసుకుని.. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని విజయశాంతి విన్నవించినట్టు చెబుతున్నారు. కాగా.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల బాట పట్టిన విజయశాంతి.. బీజేపీ-కాంగ్రెస్ అన్నట్టుగా అటు ఇటు అనేక మార్లు జంప్ చేశారు. తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ కూడా పెట్టుకుని విఫలమయ్యారు. గతంలో మెదక్ నుంచి ఒకసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆమె.. రాజకీయాల్లో తనను తాను నిరూపించుకోలేక పోయారన్న వాదన ఉంది.