నారా లోకేశ్ వెంట రాగా… నాగబాబు నామినేషన్

జనసేన అధినే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సి అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా… అన్నిసీట్లూ కూటమి పార్టీలకే దక్కనున్నాయి. అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే…వైసీపీకి 11మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఒక్క సీటు కూడా వైసీీపీకి దక్కదు.

5 ఎమ్మెల్సీల్లో ఓ సీటును జనసేనకు కేటాయించగా… ఆ సీటు నుంచి నాగబాబును బరిలోకి దించుతున్నట్లు మొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామాతో 3ఎంపీ సీట్లు ఖాళీ కాగా… వాటిలో తనకూ ఓ సీటు కావాలని జనసేన అడిగిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబును రాజ్యసభకు పంపడం కంటే కూడా ఎమ్మెల్సీగా చేసుకుని కేబినెట్ లోకి తీసుకుందామంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. ఇందుకు పవన్ కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ బరిలో దిగారు.

ఇప్పటికే 10 మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో నాగబాబు నామినేషన్ పత్రాలు సిద్ధం కాగా… వాటిని తీసుకుని శుక్రవారం మధ్యాహ్నం నాగబాబు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మంత్రి నారా లోకేశ్ స్వయంగా హాజరయ్యారు. లోకేశ్ తో జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున ఆ పార్టీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సహా పలువురు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేల ఓట్లతో జరిగే ఈ ఎన్నికల్లో నాగబాబు ఎమ్మెల్సీగా విజయం సాధించడం లాంఛనమేనని చెప్పాలి.