జగన్ మళ్లీ బెంగళూరు ఫ్లైటెక్కేశారు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మరోమారు బెంగళూరు బయలుదేరారు. 3 రోజుల క్రితం బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన జగన్… రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉన్నారు. మూడో రోజు మధ్యాహ్నమే ఆయన సతీసమేతంగా గన్నవరం ఎయిర్ పోర్టులో బెంగళూరు విమానం ఎక్కేశారు. ఈ టూర్ లో జగన్ తాడేపల్లిలో ఉన్నది కేవలం రెండు రోజులేనన్న మాట.

తాడేపల్లిలో ఉన్న రెండు రోజుల్లో జగన్ ఓ రోజు ఏపీ వార్షిక బడ్జెట్ పై సుదీర్ఘ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వేదికగా జరిగిన ఈ మీడియా సమావేశంలో జగన్ ఏకంగా 2 గంటల పాటు నాన్ స్టాప్ గా మాట్లాడారు. బడ్జెట్ లో ఆయా రంగాలకు ప్రభుత్వం చేసిన కేటాయింపుల కంటే కూడా రాజకీయ వ్యాఖ్యలకే జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వైసీపీ వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లుగా మాట్లాడారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నుంచి ఘాటుగానే బదులు వచ్చేసింది.

ఇక ప్రెస్ మీట్ చివరలో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు అయితే సోషల్ మీడియాలో రచ్చకు తెర తీశాయి. ఇక తాడేపల్లిలో ఉన్న తన రెండో రోజులో జగన్… వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. లోక్ సభ సభ్యులతో పాటుగా రాజ్యసభ సభ్యులు కూడా హాజరైన ఈ సమావేశంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ రెండు కార్యక్రమాలకే పరిమితమైన జగన్… మూడో రోజు ఫార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టలేదనే చెప్పాలి. అంతేకాకుండా శుక్రవారం మధ్యాహ్నమే ఆయన బెంగళూరు ఫ్లైట్ ఎక్కడం ఆసక్తి రేకెత్తిస్తోంది.