రెస్ట్ తీసుకుంటారా?…సస్పెండ్ చేయించాలా?: లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… పార్టీ కార్యకర్తల పట్ల ఎంత కన్ సర్న్ తో ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. కార్యకర్తకు కష్టమొస్తే… లోకేశ్ నిమిషం కూడా ఆగరు. అలాంటిది అనారోగ్యం వేధిస్తున్నా…చికిత్స తీసుకుంటూనే… చేతికి సెలైన్ బాటిల్ బ్యాండేజీలను కూడా తీయకుండానే.. తన బాధ్యతలను నెరవేర్చే క్రమంలో అసెంబ్లీకి వస్తున్న నేతలు కనిపిస్తే లోకేశ్ ఊరుకుంటారా? ఎంతమాత్రం ఊరుకోరు. అలాంటి నేతలను ఖచ్చితంగా మందలిస్తారు. ముందు ఆరోగ్యం గురించి పట్టించుకోండి. మీ పనులు ఏమైనా ఉంటే మేం చూసుకుంటాం అని చెబుతారు.

ఇదంతా మనమేదో ఊహించుకుని అనుకుంటున్నదే అయినా… శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఇదే ఘటన చోటుచేసుకుంది. పాలకొల్లు నుంచి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలుసు కదా. కూటమి కేబినెట్ లో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. కీలకమైన శాఖ… అది కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయం. అనారోగ్యం ఉన్నా… అలా రాత్రి వేళ చికిత్స తీసుకుంటూ పగటి వేళలో ఆయన శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. తన శాఖకు సంబందించిన అంశాలపై హుషారుగా సమాధానాలు చెబుతున్నారు. విపక్షం విమర్శలను చీల్చి చెండాడుతున్నారు కూడా.

అనారోగ్యంతో నిన్న రాత్రి ఆయన సెలైన్ బాటిళ్లు ఎక్కించుకున్నట్లు ఉన్నారు. ఆ బాటిళ్లు చేతికి ఎక్కించుకున్న వెంటనే పూర్తిగా బ్యాండేజీలను తీయడం కుదరదు కదా. అందుకే ఆ బ్యాండేజీలు అలానే చేతికి పెట్టుకునే నిమ్మల శుక్రవారం సభకు వచ్చారు. ఈ సందర్భంగా లాబీల్లో లోకేశ్ కు ఆయన ఎదురు పడ్డారు. నిమ్మల చేతికి బ్యాండేజీ చూసిన వెంటనే లోకేశ్ ఆగ్రహానికి గురయ్యారు. అనారోగ్యం పెట్టుకుని సభకు ఎందుకు వచ్చారు? అంటూ నిమ్మలను ప్రశ్నించారు. దీంతో కాస్త కంగారు పడిపోయిన నిమ్మల… అదేమంత పెద్ద సమస్య కాదులే…చికిత్స కూడా తీసుకున్నాను… ఫరవా లేదు.. అసెంబ్లీ సమావేశాలు కదా.. రాక తప్పుతుందా?… అంటూ నీళ్లు నమిలారు.

అన్నా.. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ముందు ఆరోగ్యం గురించి చూసుకోవాలి. ఆరోగ్యం బాగుంటేనే అన్ని పనులూ కుదురుతాయి. అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం కదా… మీకు కూడా చెప్పాలా? అయినా ఇంత బాధ పడుతూ… సెలైన్ బాటిళ్లు పెట్టించుకుంటూ సభకు ఎలా వచ్చారు? అంటూ లోకేశ్… నిమ్మలను దాదాపుగా అరిచేసినంత పని చేశారు. పనులు ఉంటే… అసెంబ్లీ ఉంటే చూసుకోవడానికి మేం లేమా? అని కూడా లోకేశ్ నిష్టూరమాడారు. ఇంకా నిమ్మల ఏదో సర్దిచెబుతుండగా…ఇలా కుదరదనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. రెస్ట్ తీసుకుంటారా? సభ నుంచి సస్సెండ్ చేయించమంటారా? అంటూ లోకేశ్ మరింత హెచ్చరించారు. సరే రెస్ట్ తీసుకుంటానులే అని నిమ్మల అంటే.. అలా రా మరి దారికి అంటూ లోకేశ్ సాగాపోయారు. ఆ తర్వాత సబలోనూ లోకేశ్ ఈ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం.