విజయమ్మ, షర్మిలలపై జగన్ సంచలన ఆరోపణ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట వెలుగుచూసిన ఆస్తుల పంచాయతీ అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తోంది. జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస షర్మిలలు ఒకవైపు నిలవగా… తన సతీమణి వైఎస్ భారతితో కలిసి జగన్ మరో వర్గంగా నిలిచారు. సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో ఇరు వర్గాలు ఆది నుంచి బిన్న వాదనలను వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కోర్టులో విచారణలో ఉంది.

ఎప్పటికప్పుడు ఈ కేసులో అటు విజయమ్మ తరఫున, ఇటు జగన్ తరఫున పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి. ఒకరు ఓ పిటిషన్ దాఖలు చేస్తే… దానిపై వివరణ ఇస్తూ మరో వర్గం కౌంటర్ దాఖలు చేస్తోంది. ఆ కౌంటర్ కు ప్రతి కౌంటర్ కూడా దాఖలు అవుతోంది. ఇటీవల విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో అసలు సదరు కంపెనీలో జగన్ కు గానీ… భారతికి గానీ చిల్లిగవ్వ కూడా వాటా లేదని ఆమె కోర్టుకు తెలిపారు. కంపెనీకి చెందిన మొత్తం 99 శాతం షేర్లు తన పేరు మీదే ఉన్నాయని కూడా విజయమ్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తాజాగా జగన్ తన కౌంటర్ ను దాఖలు చేశారు. ఈ కౌంటర్ లో విజయమ్మ, షర్మిలలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన పేరు, తన సతీమణి భారతి పేర్లపై ఉన్న షేర్లను తమకు తెలియకుండానే విజయమ్మ, షర్మిలలు వారి పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కనీసం తన సంతకాన్నీ వారు తీసుకోకుండానే షేర్లను వారి పేర్లపైకి బదలాయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఇలా జరిగిన షేర్ల బదలాయింపును నిలుపుదల చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు విజయమ్మ, షర్మిలలతో సాడు సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆప్ కంపెనీస్ లను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. జగన్ వాదనపై కౌంటర్లు దాఖలు చేసేందుకు విజయమ్మ తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 3కు కోర్టు వాయిదా వేసింది.