బీజేపీ దూకుడు.. దీని ప‌ర‌మార్థ‌మేమి?!

తెలంగాణ‌లో బీజేపీ దూకుడు పెరిగిందా? ఆ పార్టీ పుంజుకుంటోందా? అంటే.. తాజాగా జ‌రిగిన‌ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ క‌మ‌ల నాథుల వికాసాన్ని బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ఒక‌టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం అయితే.. రెండు ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీల స్థానాలు ఉన్నాయి. వీటిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న అధికార పార్టీ కాంగ్రెస్‌.. పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేసింది. విజ‌యం ద‌క్కించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి ప్ర‌చారం చేశారు. అయితే.. అనూహ్యంగా బీజేపీ ఈమూడు స్థానాల‌ను కైవసం చేసుకుంది.

వరంగల్-నల్గొండ- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి అదేవిధంగా ఇదే ప్రాంతాల్లో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి గ‌త నెల 27న ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటి ఓట్ల లెక్కిం పు ప్ర‌క్రియ జోరుగా సాగింది. భారీ స్తాయిలో ఓట్ల శాతం న‌మోదైంది. ఇక‌, ఈ ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నిక‌ల పోటీకి దూరంగా ఉంది. అయితే.. మ‌ధ్య‌లో బీఎస్పీ రంగంలోకి దిగింది. దీంతో ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్‌-బీజేపీల మ‌ధ్యే సాగినా.. మ‌ధ్య‌లో బీఎస్పీ ఎంట్రీతో ఓటు బ్యాంకు చీలిపోయిం ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, ప్ర‌చార ప‌ర్వంలో ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌కుండా.. వ్య‌వ‌హ‌రించారు. సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా.. ప్ర‌చారం చేయ‌డంతో పాటు.. తాయిలాల‌కు కూడా కొద‌వ‌లేకుండా పోయింది. ఇక‌, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌, ఇటు సీఎం రేవంత్ స‌హా మంత్రులు దుమ్మురేపారు. రాజ‌కీయ విమ‌ర్శ‌లు, స‌వాళ్లకు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వేదిక‌గా నిలిచాయి. ఇక‌, ఓటు బ్యాంకు రాజ‌కీయాలు కూడా జోరుగానే సాగాయి. ఇదిలావుంటే..ఎన్నిక‌ల వేళ ఓట్ల శాతం పెరిగిన‌ప్పుడే.. అధికార పార్టీకి బ్యాడ్ సంకేతాలు వ‌చ్చాయి. ఎప్పుడు ఓట్ల శాతం పెరిగినా.. సెంటిమెంటు ప్ర‌కారం.. అది అధికార పార్టీ వ్య‌తిరేక‌త‌గా ముద్ర ప‌డిన విష‌యం తెలిసిందే.

తాజా ఎన్నిక‌ల్లోనూ స‌గ‌టున‌ 70 శాతం ఓటు బ్యాంకు న‌మోదైన నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఎక్కువ‌గానే ఉంద‌ని అనుకున్నారు. అనుకున్న‌ట్టుగానే.. తాజాగా అందిన తుది ఫ‌లితం కాంగ్రెస్ స‌ర్కారును ఇర‌కాటంలోకి నెట్టింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల‌ను బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్ టీచ‌ర్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన గ్రాడ్య‌యేట్ ఎమ్మెల్సీ స్థానాన్నీ సొంతం చేసుకుంది. ఈ ప్ర‌భావం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పుంజుకుంటున్న‌ద‌న్న సంకేతాలు ఇస్తోంద‌ని క‌మ‌ల నాథులు వ్యాఖ్యానిస్తున్నారు.