కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బుధవారం మరింతగా చెలరేగిపోయారు. నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను టార్గెట్ చేసిన మల్లన్న…బుధవారం నేరుగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. వాస్తవానికి సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించడం, రేవంత్ సర్కారు నిర్వహించిన బీసీ కుల గణన నివేదిక కాపీలను తగలబెట్టిన కారణంగానే మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. తాజాగా మల్లన్న నేరుగా రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బుధవారం మీడియా ముందుకు వచ్చిన మల్లన్న… సీఎంగా ఉన్నరేవంత్ కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పురోగతికి దోహదపడాల్సిన రేవంత్.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్న రేవంత్ రెడ్డి… బీజేపీకి పరోక్షంగానే కాకుండా ప్రత్యక్ష్యంగా సాయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంటు సీటు, రేవంత్ రెడ్డి సిట్టంగ్ సీటు మల్కాజిగిరీ.. రెండు సీట్లలో కావాలనే కాంగ్రెస్ ను ఓడించారని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి బీజేపీకి లబ్ధి జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గెలిచినా,ఓడినా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఫలితంగా అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని కూడా మల్లన్న చెప్పారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీసీ నేతకు టికెట్ ఇచ్చి అక్కడ విజయం సాధించి… ఆ ఇంపాక్ట్ తో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశగా కదులుతోందన్నారు.
రేవంత్ రెడ్డి చర్యల కారణంగా ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న మల్లన్న.. ఈ విషయంపై ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు మంటలు రేపుతున్నాయి. వరుసబెట్టి కీలక నేతలంతా మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేస్తున్నారు.