ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు నోట నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని క్షమిస్తున్నానని అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ హోదాకు జగన్ దురుద్దేశాలు ఆపాదించారని చెప్పిన అయ్యన్న… అయినప్పటికీ… సభాపతి హోదాలో జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న పేర్కొన్నారు. ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలని సూచించిన అయ్యన్న… అలా జరగని పక్షంలో, జగన్ తన పాత వైఖరితోనే సాగితే… ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం సభకు తెలుసునని వ్యాఖ్యానించారు.
బుధవారం నాటి సభా సమావేశాలు ప్రారంభం కాగానే…జగన్ అంశాన్ని ప్రస్తావించిన స్పీకర్ అయ్యన్న ప్రత్యేక రూలింగ్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 10 శాతం సీట్లు రాలేదని ఆయన చెప్పారు. అయినా కూడా తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ జగన్… స్పీకర్ హోదాలో ఉన్న తనను బెదిరించేలా లేఖ రాశారన్నారు. ఈ లేఖలో జగన్ పలు అవాస్తవాలను ప్రస్తావించారని తెలిపారు. అవాస్తవాలతో సభాపతికి లేఖ రాయడం ముమ్మాటికీ సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన తెలిపారు. ఇక ఆ తర్వాత జగన్ ఇదే అంశం మీద హైకోర్టును ఆశ్రయించారని ఆయన గుర్తు చేశారు.
జగన్ పిటిషన్ ను ఆధారం చేసుకుని హైకోర్టు స్పీకర్ కు నోటీసులు జారీ చేసిందని కూడా వైసీపీ ప్రచారం చేసిందని అయ్యన్న ఆరోపించారు. అయితే ఇందులో వాస్తవం లేదని తెలిపారు. హైకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కూడా ఆయన వెల్లడించారు. మొత్తంగా అన్నీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జగన్.. సభా మర్యాదలను మంటగలిపారని ఆయన ఆరోపించారు. ఈ లెక్కన జగన్ పై సబా హక్కుల ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశం స్పీకర్ గా తనకు ఉందన్నారు. అయితే వీటన్నింటినీ సంధి ప్రేలాపనలుగా భావిస్తూ జగన్ ను క్షమిస్తున్నానని అయ్యన్న వ్యాఖ్యానించారు. జగన్ తన ధోరణి మార్చుకోకపోతే మాత్రం ఆయనను ఏం చేయాలన్న దానిపై సభ ఆలోచన చేస్తుందని ఆయన హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates