ఏపీ సీఎం చంద్రబాబు.. నిరుద్యోగులకు భారీ జాక్ పాట్ ప్రకటించారు. ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తే తప్ప.. కరుణించని ప్రభుత్వాల తీరు నిరుద్యోగులకు తెలుసు. అయితే.. ఎలాంటి నిరసనలు లేకుండానే కేవలం చిన్న అభ్యర్థన.. గతంలో తాను రా.. కదలిరా..! సభల్లో పాల్గొన్నప్పుడు అనేక మంది నిరుద్యోగులు వెల్లడించిన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది భవిష్యత్తులో నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ.. కూటమి సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 34 సంవత్సరాల వయసు నుంచి 42 ఏళ్లకు పెంచారు. ఇది అన్ని రకాల ఉద్యోగాలకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. ఒక్క పోలీసు, ఫైర్ డిపార్ట్‌మెంట్ సహా యూనిఫాం సర్వీసులకు మాత్రం మినహాయించారు. యూనిఫాం సర్వీసు ఉద్యోగుల వయోపరిమితి మాత్రం జనరల్ అభ్యర్థులకు 38 ఏళ్లుగా ఉంటుంది. ఎస్సీ , ఎస్టీ ఉద్యోగులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. బీసీ అభ్యర్థులకు మూడేళ్ల వెసులుబాటు ఉంటుంది.
వైసీపీ హయాంలోనూ.. ఉద్యోగుల వయోపరిమితిని పెంచారు. అప్పట్లో ఏకంగా జనరల్ అభ్యర్థుల వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచారు. దీంతో రాజకీయ లబ్ధి కలుగుతుందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అయితే.. దీనిపై అప్పట్లో నిరుద్యోగులే తిరగబడ్డారు. తమకు అవకాశాలు పోతాయని.. ఇదేం పెంపని.. ప్రశ్నిస్తూ.. చాలా మంది కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సర్కారు వెనక్కి తగ్గింది. ఆ తర్వాత.. అసలు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో.. దీనిపై పెద్దగా చర్చలేకుండా పోయింది. ఇదిలావుంటే.. తాజాగా కూటమి సర్కారు ఇచ్చిన వెసులుబాటు త్వరలోనే విడుదల కానున్న డీఎస్సీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇది ఒకరకంగా ఉద్యోగులకు జాక్ పాటే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.