జనసేన తిరుపతి నేత కిరణ్ రాయల్ పై రేగిన వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. రోజుల తరబడి ఏపీలో హాట్ టాపిక్ గా మారగా.. రోజుకో వీడియో చొప్పున బయటకు వచ్చి కిరణ్ రాయల్ ను రాజకీయంగా ఓ రేంజిలో సతమతం చేసింది. పార్టీ కార్యకలాపాలకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలంటూ రాయల్ ను జనసేన ఆదేశించింది. ఈ ఆదేశాలు విడుదల అయిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగినట్టే కనిపించినా… లక్ష్మి అరెస్టుతో మరోమారు వేడెక్కింది. ఆ తర్వాత క్రమంగా ఈ వివాదం చల్లబడిపోయింది.
ఈ వివాదం విషయంలోకి వెళితే.. తిరుపతి నగరానికి చెందిన లక్ష్మీ అనే మహిళ ఒకానొక రోజు మీడియా ముందుకు వచ్చి కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. రాయల్ తో తాను కొంతకాలం పాటు కలిసి ఉన్నానని, ఈ సమయంలో రాయల్ తన వద్ద నుంచి రూ.1.20 కోట్లను తీసుకున్నారని, ఆ డబ్బుతో పాటుగా కొంత బంగారం కూడా తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వమంటే ఇవ్వడం లేదని ఆరోపించారు. అదే సమయంలో రాయల్ తో లక్ష్మి అత్యంత సన్నిహితంగా ఉన్న పలు వీడియోలు వరుసగా సోషల్ మీడియాలోకి వచ్చి చేరాయి. దీంతో రాయల్ పై రేగిన వివాదం ఓ రేంజిలో వైరల్ అయిపోయింది. ఈ వివాదానికి కారణం వైసీపీ అని, వారిని వదిలిపెట్టేది లేదని రాయల్ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఈ వివాదంలో లక్ష్మి మీద రాయల్, రాయల్ మీద లక్ష్మి పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఇద్దరిపైనా తిరుపతి పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తమ మధ్య నెలకొన్న వివాదం సమసిపోయిందని మంగళవారం లక్ష్మి స్వయంగా ప్రకటించారు. కోర్టు సమక్షంలోనే తమ మధ్య రాజీ కుదిరిందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా తాము పరస్పరం పెట్టుకున్న కేసులను కూడా వాపస్ తీసుకున్నామని… దీంతో ఇప్పుడు ఆ కేసులు కూడా లేవని తెలిపారు. ఈ వ్యవహారంలో కొందరు నేతలు తనను తప్పుదోవ పట్టించారని ఆరోపించిన లక్ష్మి… వారి పేర్లను మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.