రాజంపేట నుంచి గుంటూరు… గుంటూరు నుంచి ఆదోని

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటుగా వారి కుటుంబాలపైనా అసభ్య పదజాలంతో కూడిన దూషణలకు దిగిన కేసులో ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి…ఈ కేసుల్లో భాగంగా ఏపీ మొత్తం తిరిగేలానే ఉన్నారని చెప్పక తప్పదు. తొలుత హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లిన అన్నమయ్య జిల్లా పోలీసులు… జిల్లా పరిధిలోని ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదు అయిన కేసులో అరెస్ట్ చేసి రాజంపేటకు తరలించారు. రాజంపేట సబ్ జైలులో ఉండగానే…ఆయనను పల్నాడు జిల్లా పోలీసులు పీటీ వారెంట్ పై నరసరావు పేట తరలించారు.

నరసరావుపేటలో నమోదు అయిన కేసులో స్థానిక న్యాయమూర్తి పోసానికి జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు ఆయనను గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. రాజంపేట జైలులో ఓ నాలుగు రోజుల పాటు ఉన్న పోసాని… గుంటూరు జిల్లా జైలులో రెండంటే రెండు రోజులున్నారో, లేదో..అప్పుడే ఆయన వద్దకు కర్నూలు జిల్లా పోలీసులు వచ్చేశారు. కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని పోలీస్ స్టేషన్ లో పోసానిపై ఇవే ఆరోపణల ఆదారంగా కేసు నమోదు అయ్యిందట. ఈ కేసు విచారణలో భాగంగా పోసానిని తమకు అప్పగించాలని కర్నూలు జిల్లా పోలీసులు మంగళవారం పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో గుంటూరు జైలు అధికారులు పోసానిని కర్నూలు జిల్లా పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా నరసరావుపేట సబ్ జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా పోసాని చేతిలో ఓ చేతి సంచి కనిపించింది. బహుశా అందులో దుస్తులున్నాయోమో.. దానిని అలా భుజాన వేసుకుని పోసాని జైలు బయటకు రాగా… కర్నూలు పోలీసులు ఆయనను తమ వాహనంలోకి ఎక్కించేశారు. ఈ రాత్రికి నరసరావుపేట నుంచి బయలుదేరే వీరు రేపు ఉదయానికి గానీ ఆదోని చేరుకోలేరు. బుధవారం ఉదయం ఆదోని మేజిస్ట్రేట్ ముందు పోసానిని పోలీసులు హాజరు పరచనున్నారు. అక్కడ నమోదు అయిన కేసులో జడ్జి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే.. ఆదోనిలోని సబ్ జైలుకు గానీ, లేదంటే కర్నూలులోని జిల్లా జైలుకు గానీ పోసానిని తరలించనున్నారు. ఆ తర్వాత ఇంకే జిల్లా పోలీసులు పోసాని కోసం కర్నూలు జిల్లాలో అడుగుపెడతారో చూడాలి.