వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజినీ అతి త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు అంతకంతకూ బలపడున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేయగా… కేవలం కొన్ని అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆమె అరెస్టుకు మరికాస్త సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ… జగన్ సెకండ్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో రజనీని జగన్ చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చగా… ఆమె ఓటమిపాలయ్యారు. అంతకుముందు ఆమె టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించారు.
ఇక ఇప్పుడు రజనీని కష్టాల పాలు చేసిన కేసు వివరాల్లోకి వెళితే… మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రజనీ వసూళ్ల పర్వానికి తెర తీశారని ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి ఆమె ఏకంగా రూ.2.20 కోట్లను వసూలు చేశారట. ఈ మేరకు కీలక సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ జరపగా… ఈ ఆరోపణలు నిజమేనని తేలింది. పన్నులు ఎగ్గొట్టారంటూ నాటి విజినెన్స్ ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువా నుంచి క్రషర్ యజమానులను రజనీ బెదిరించారట. రూ.5 కోట్లు ఇస్తే.. సమస్య పరిష్కారం అయిపోతుందని రజనీ పీఏ వారికి సూచించారట. ఈ క్రమంలో రజనీతో చర్చలకు క్రషర్ యజమానులు సిద్ధపడగా… అంతిమంగా రూ.2.20 కోట్లకు డీల్ కుదిరిందట. ఈ మొత్తంలో రజనీకి రూ.2 కోట్లు అందగా… ఐపీఎస్ జాషువాకు రూ.10 లక్షలు, రజనీ పీఏకు రూ.10 లక్షలు ముట్టాయట.
ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన విజిలెన్స్ శాఖ… ఈ ఆరోపణలు వాస్తవమేనని నిగ్దు తేల్చింది. ఈ నివేదికను ఇదివరకే ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఇప్పటికే దృష్టి సారించింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై కేసు నమోదుతో పాటు విచారణ చేసేందుకు అనుమతించాలన్న ఏసీబీ అభ్యర్థనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. తాజాగా రజనీపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు అనుమతించాలంటూ గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. ఈ మేరకు గవర్నర్ నుంచి అనుమతి రాగానే… రజనీపై కేసు నమోదు చేయడంతో పాటు ఆమెను విచారించేందుకు ఏసీబీ రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. ఎలాగూ నేరం ఇప్పటికే నిరూపితమైన నేపథ్యంలో రజనీ అరెస్టు ఖాయమేనని చెప్పాలి.