ఈ ప్రభుత్వానికి రంగు, రుచి, వాసన లేవు: అచ్చెన్న

ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి బొత్స అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది. వైసీపీ నేతలు గాలికి వచ్చారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎవరిపై విమర్శలు చేయలేదని, ఈ వ్యాఖ్యలను అచ్చెన్న వెనక్కి తీసుకోవాలని బొత్స అన్నారు. ఇక, పథకాలపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని, అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకతీతంగా పథకాలు ఇవ్వాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే బొత్సకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు.

42 సంవత్సరాల అనుభవమున్న పార్టీ టీడీపీ అని, ఎన్నికల వరకే రాజకీయాలు అని అచ్చెన్న చెప్పారు. ఈ పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు, రుచి, వాసన లేవని, ధనవంతుడు లేడని…..పేద వాడే పార్టీకి క్రైటీరియా..పేదరికమే అని అన్నారు. కులం, మతం, రాజకీయం చూడబోమని, అర్హులైన వారందరికీ అన్ని పథకాలిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు, అర్హులైన వారెవరికైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటూ వైసీపీ సభ్యులకు సూచించారు. చంద్రబాబు మాటలను వక్రీకరించారని అన్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలనతో బిల్డింగులకు రంగులు వేయడం తప్ప వైసీపీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో మాట్లాడాలంటే భయపడే పరిస్థితులున్నాయని, ప్రశ్నించే హక్కు లేదని చెప్పారు. ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమానికి వెళదామంటే తెల్లవారుజామునే పోలీసులు హౌస్ అరెస్టులు చేసేవారని గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అయినా సరే హౌస్ అరెస్టులు వంటి కక్షపూరిత చర్యలు తమ ప్రభుత్వం చేయడం లేదని గుర్తు చేశారు.