రేవంత్ గొప్పోడు!.. ఉత్తమ్ అదృష్టవంతుడు!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిది నిజంగానే గొప్ప మనసు. ఆదివారం ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగిన మీడియా సమావేశంలో తన కేబినెట్ లోని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన ఆకాశానికెత్తేశారు. సొరంగం ప్రమాదంలో ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలో తనకంటే కూడా ఉత్తమ్ కే ఎక్కువ తెలుసంటూ రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పూర్వాశ్రమంలో ఉత్తమ్ భారత సైన్యంలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసిన రేవంత్…సహాయక చర్యల్లో ఉత్తమ్ తనకంటే కూడా ఉత్తమంగా రాణించారని కీర్తించారు.

తాజాగా ఢిల్లీ వెళ్లిన రేవంత్ తన వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సాగు నీటి రంగం, సొరంగం ప్రమాదం గురించిన ప్రశ్నలను నేషనల్ మీడియా సంధించగా… రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ”హీ ఈజ్ ద రైట్ పర్సన్” అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్య నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఉత్తమ్ సరైన వ్యక్తి అంటూ నేషనల్ మీడియా గొట్లాల నుంచి తాను పక్కకు తప్పుకుని ఉత్తమ్ మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. రేవంత్ తీరుతో ముసిముసిగానే నవ్వుకుంటూ ఉత్తమ్ నేషనల్ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ప్రస్తుత రాజకీయాల్లో… అది కూడా పదవుల కోసం కుస్తీలకు దిగే రాజకీయాలకు ఏమాత్రం కొదవ లేని కాంగ్రెస్ పార్టీలో రేవంత్ లాంటి నేత ఉండటం నిజంగా అరుదే. ఎప్పుడెప్పుడు సీఎం సీట్లో ఉన్న నేతను దించేసి… తాము ఆ సీటును ఎక్కుదామా? అంటూ కాంగ్రెస్ నేతలు నిత్యం యత్నిస్తూనే ఉంటారు. అలాంటి పార్టీలో ఉంటూ కూడా తన కేబినెట్ లో మంత్రిగా…తన కంటే సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న ఉత్తమ్ కు ఇంతగా ఎలివేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్ది నిజంగానే గొప్పవారని చెప్పక తప్పదు. అదే సమయంలో సీఎం నోట ఇంతలా కీర్తింపబడుతున్న ఉత్తమ్ కంటే అదృష్ణవంతుడు మరెవరూ ఉండరనీ చెప్పొచ్చు.