ఏపీ సీఎం చంద్రబాబు తన గౌరవాన్ని కాపాడుకున్నారు. అసెంబ్లీ సభా నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు.. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న మాట ఉన్నా..(నిజానికి మెరుగైన సీట్లు రాలేదన్నది ప్రధాన వాదన. 10 శాతం సీట్లు ఇస్తే..ఇస్తామ ని సీఎం చంద్రబాబు కూడా చెబుతున్నారు. ఇదే వాదనను సభ కూడా చెబుతోంది) ఇతర విషయాల్లో మాత్రం చంద్రబాబు తన గౌరవాన్ని సభా మర్యాదను మాత్రం పక్కాగా కాపాడుతున్నారు. కానీ.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం తన గౌరవాన్నే కాకుండా.. తన పార్టీ తరఫున విజయం దక్కించుకున్నవారి గౌరవాన్ని కూడా కాపాడుకోలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి.. ప్రధాన ప్రతిపక్షం హోదా లేనందున.. పైగా 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నందున వైసీపీకి అసెంబ్లీలో చివరి సీట్లు కేటాయిస్తారని అందరూ అనుకున్నారు. ఆది నుంచి కూడా ఇదే తరహా చర్చ సాగింది. దీనిపై వైసీపీలోనూ ఒకరకమైన చర్చ ఉంది. కానీ, తాజాగా సీట్ల కేటాయింపులో జగన్‌కు కానీ.. వైసీపీకి కానీ.. ఎక్కడా గౌరవ భంగం కలిగించకుండా.. సీఎం చంద్రబాబు విజ్ఞతప్రదర్శించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా.. జగన్‌కు సభకు రాకపోయినా.. ఆయనకు ప్రతిపక్ష నేతలకు కేటాయించే(స్పీకర్‌కు ఎడమ వైపు భాగంలో) సీట్లలో తొలి వరుసలో ఫస్ట్ సీటును కేటాయించారు. ఇక, ఆ తర్వాత.. 12 సీట్లను రిజర్వ్ చేసి.. వైసీపీకి ఇచ్చారు.
మళ్లీ 13 వ నెంబరు నుంచి టీడీపీ సభ్యులకు కేటాయించారు. అంటే.. ఎవరైనా లీజర్‌గా ఉంటే.. అటువైపు వెళ్లి కూర్చునేందుకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా అతిధులు వచ్చినా.. ఇతర ప్రముఖులు స్పీకర్ అనుమతితో సభ సందర్శనకు వచ్చినా.. వారికి తర్వాత సీట్లు ఇచ్చారే తప్ప.. జగన్‌కు కేటాయించిన సీట్లను మాత్రం ఎవరికీ కేటాయించకపోవడం ద్వారా సభా సంప్రదా యాలకు.. విపక్షానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం విషయంలోనూ సీఎం చంద్రబాబు ఎక్కడా తక్కువ చేయలేదు. కేవలం ప్రధాన ప్రతిపక్షం అనే హోదా విషయంలోనే ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మేం ఎలా ఇస్తామన్న చర్చమాత్రమే ఉంది.
సో.. ఈ పరిణామాలను బట్టి.. చంద్రబాబు తన విజ్ఞతను కాపాడుకున్నట్టు అయింది. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికైనా.. తనకు సభలో గౌరవం దక్కింది కాబట్టి.. ఆయన సభకు రావడమే ఉత్తమని కూటమి నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. పైగా.. సభలో ఏం జరుగుతోందన్నది ప్రజలు కూడా గమనిస్తున్నారని.. సీట్ల విషయంలో ఇచ్చిన గౌరవాన్ని కూడా.. ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.