భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ సెలవు రోజు ఆదివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సతీసమేతంగా భాగ్యనగరికి వచ్చిన ధన్ కడ్ కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా సంగారెడ్డి సమీపంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ని సందర్శించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఆయన ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
తెలుగు నేలకు వచ్చిన ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు తెలంగాణ ప్రభుత్వంతో పాటుగా ఏపీ ప్రభుత్వం తరఫున కూడా ఘన స్వాగతం లభించింది. తెలంగాణ సర్కారు నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపరాష్ట్రపతి ధన్ కడ్ కు స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీకి చెందిన శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో పాటుగా ఏపీకి చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ లు ఉపరాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే… రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానంటూ ప్రకటించిన వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా ఉపరాష్ట్రపతి ధన్ కడ్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. రాజకీయాలను వదిలేసి వ్వవసాయం చేసుకుంటానంటూ ప్రకటించిన సాయిరెడ్డి… ఉపరాష్ట్రపతి టూర్ లో ప్రత్యక్షమవడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన దన్ కడ్ దంపతులు ఆ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు.