ఆ 8 మంది ప్రాణాల‌తో ఉన్న‌ట్టేనా? :  రేవంత్ ఏం చెప్పారు

తెలంగాణ ప‌రిధిలోని శ్రీశైలం ప్రాజెక్టులో చేప‌ట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌(ఎస్ ఎల్ బీసీ) ట‌న్నెల్‌లో ఈ నెల 22న జ‌రిగిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు ఇంజ‌నీర్లు స‌హా 8 మంది కార్మికులు కూరుకుపోయారు. పై నుంచి మ‌ట్టి పెళ్ల‌లు విరిగి ప‌డ‌డంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. హుటాహుటిన రంగంలోకి దిగి.. అధునాతన యంత్రాల‌ను ప్ర‌యోగించినా.. బాధితుల‌కు మాత్రం సాంత్వ‌న చేకూర్చ‌లేక పోయార‌న్న‌ది వాస్త‌వం. అయితే.. ఇప్ప‌టికి 10 రోజులు పూర్త‌యిన నేప‌థ్యంలో అస‌లు  ఆ 8 మంది విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా అనుమానాస్ప‌దంగా మారింది.

ఈనేప‌థ్యంలో తాజాగా ఆదివారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి.. క్షేత్ర‌స్థాయిలో ట‌న్నెల్‌లో ప‌ర్య‌టించి ప‌రిస్థితిని స‌మీక్షించారు. స‌ద‌రు ఎనిమిది మంది ప్రాణాల ప‌రిస్థితిపైనా ఆయ‌న ఆరా తీశారు. వారంతా ప్రాణాల‌తోనే ఉండాల‌ని.. ఉంటార‌ని తాను వ్య‌క్తిగ‌తంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. ప‌రిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంద‌ని చెప్పారు. అనేక ప్ర‌య‌త్నాలు చేసి నా.. ట‌న్నెల్‌లో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్న‌ట్టు తెలిపారు. అధునాత‌న రోబోల‌ను కూడా వినియోగిం చాల‌ని ఆదేశించిన‌ట్టు చెప్పారు. మానవ ప్ర‌య‌త్నంతో పాటు మిష‌న్ల ప్ర‌య‌త్నాన్ని కూడా.. తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

తాజాగా ట‌న్నెల్‌లోనే మీడియా మీటింగ్ పెట్టిన సీఎం.. ప‌రిస్థితిని తాను తీవ్రంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఎనిమిది మంది చ‌నిపోయార‌ని కానీ.. వారు బాగున్నార‌ని కానీ, ఆయ‌న నేరుగా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. కానీ, బాగుండాల‌ని కోరుకుంటున్న ట్టు తెలిపారు. అయితే.. వారి ఆచూకీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ల‌భించ‌లేద‌న్నారు. కానీ, వెతుకులాట మాత్రం కొన‌సాగుతోంద న్నారు. ఏదైనాజ‌రిగిన‌ప్పుడు రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని ఆయ‌న ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌కు హిత‌వు ప‌లికారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌న్నారు. ఎవ‌రూ ఆందోళ‌న‌కు గురికావాల్సిన అవ‌స‌రం లేద‌న్న సీఎం రేవంత్రెడ్డి.. తాను కూడా వ్య‌క్తిగ‌తంగా శ్ర‌ద్ధ తీసుకుని ట‌న్నెల్‌లో జ‌రుగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్టు తెలిపారు.

ప‌దేళ్లు గాడిద‌లు కాశారు!

గ‌త ప‌దేళ్ల‌లో ట‌న్నెల్ ప‌నులు చేప‌ట్ట‌కుండా.. బీఆర్ ఎస్ నాయ‌కులు గాడిద‌లు కాశార‌ని సీఎం రేవంత్ రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. 2005లోనే అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ కోసం.. ఈ ట‌న్నెల్ ప‌నులు చేప‌ట్టింద‌న్నారు. ఇది మాన‌వ నిర్మిత మ‌హాద్భుత ట‌న్నెల్‌గా ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. బీఆర్ ఎస్ స‌ర్కారురాక‌తో ప‌నులు నిలిచిపోయాయ‌ని తెలిపారు. పైగా విద్యుత్ చార్జీలు చెల్లించ‌క పోవ‌డంతో విద్యుత్‌ను కూడా క‌ట్ చేశార‌ని ఆరోపించారు. కేవ‌లం కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌న్న ఏకైక కార‌ణంతో ట‌న్నెల్ ప‌నుల‌ను గాలికి వ‌దిలేశార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. ఇప్పుడు తాము పున‌ర్నిర్మిస్తున్నామ‌ని.. కానీ, అనుకోని దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.