టీడీపీ చరిత్రలో పట్టు సాధించలేని నియోజకవర్గాల్లో.. పార్టీని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నారని ముద్ర వేసుకున్న నియోజకవర్గాల్లో ఒకటి అత్యంత కీలకమైన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. బెజవాడ మొత్తంగా పార్టీ దూకుడు ఉంటుంది. కానీ, వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం జెండా పట్టుకునే నాథుడు కనిపించరు. పోనీ.. ఇక్కడ నాయకులకు కరువుందా? అంటే.. విజయవాడ నగర పార్టీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న నివాసం ఉన్నది ఈ నియోజకవర్గంలోనే! అయినా కూడా పార్టీ పుంజుకుంటున్నది లేదు. పార్టీ తరఫున గళం వినిపించే నియోజకవర్గం నాయకుడు కూడా ఒక్కరూ కనిపించరు.
నాయకులు బోలెడు మంది ఈ నియోజకవర్గంపై కన్నేసినా.. ఒక్కరూ కూడా పట్టు పెంచుకోలేక పోయారు. దీనికి కారణం ఏంటి? 2014లో బాబు రావాలి.. బాబు కావాలి అనే నినాదం ఊరూవాడా మార్మోగినా.. ఇక్కడ మాత్రం వినిపించలేక పోయారు. మరి దీనికి కారణం ఎవరు? పార్టీ చరిత్రలో ఒకే ఒక్కసారి 1983 ఎన్నికల్లో బీఎస్ జయరాజ్ టీడీపీ తరఫున ఇక్కడ జెండా ఎగరేశారు. అఖండ మెజారిటీ గెలిచారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్కరూ విజయం సాధించలేకపోయారు. పార్టీ పొత్తులు పెట్టుకుంటే.. పొత్తు పెట్టుకున్న పార్టీకి ఇచ్చే నియోజకవర్గం ఇదే! దీంతో ఇక్కడ పార్టీ పుంజుకోలేక పోయిందనే వాదన బలంగా ఉంది.
అదేసమయంలో నాగుల్ మీరా వంటి కీలక నాయకుడు ఉన్నప్పటికీ.. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయి.. ఎవరికి వారే ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రయత్నించారు తప్ప.. ఒకరికి మద్దతుగా నిలిచిన సందర్భాలు కూడా కనిపించవు. గత ఎన్నికలకు ముందు వైసీపీ గెలిచింది. ఈ పార్టీ తరఫున గెలిచిన సీనియర్ నాయకుడు జలీల్ ఖాన్ పార్టీ మారి సైకిల్ ఎక్కారు. ముస్లిం సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ఈయనైనా పార్టీని నిలబెడతారని బాబు ఊహించారు. ఆయన కుమార్తె షబానా ఖతూన్‌కు ఛాన్స్ ఇచ్చారు. అయినా కూడా పార్టీ విజయం సాధించలేకపోయింది.
దీనికి కారణం కూడా గ్రూపు రాజకీయాలేనని పార్టీలో చర్చ సాగింది. ఇక, ఇప్పుడు పార్టీ పదవుల్లో ఇక్కడి వారికి ఎవరికీ కూడా బాధ్యతలు దక్కలేదు. దీంతో ఎవరికి వారు సైలెంట్ అయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇక్కడ చక్రం తిప్పాలని ప్రయత్నించినా.. ఆయనకు కూడా సాధ్యం కాలేదు. ఇక, పార్టీలో ఆయనకు కూడా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో ఆయన కూడా మౌనం పాటిస్తున్నారు. దీంతో టీడీపీ జెండా మోసే నాయకుడు కూడా కనిపించడం లేదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మరి ఈ పరిస్థితి మార్చేందుకు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. ఇప్పటికే సమయం మించిపోయిందనేది తమ్ముళ్ల ఆవేదన. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates