ఏపీలో ఆదివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ పై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నాడు నరసాపురం ఎంపీగా ఉన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిన సమయంలో సునీల్ కుమారే సీఐడీ చీఫ్ గా ఉన్నారు. సునీల్ ఆధ్వర్యంలోనే రఘురామపై థర్డ్ డిగ్రీ జరిగిందన్న ఆరోపణలూ లేకపోలేదు. ఇక కూటమి సర్కారు పాలన కాగానే… సునీల్ కుమార్ ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసిన ఉన్నతాధికారులు… ఆయనకు ఇప్పటిదాకా పోస్టింగే ఇవ్వలేదు.
తాజాగా తన సర్వీసులో కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అతిక్రమించారన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సునీల్ కుమార్ పై సస్పన్షన్ వేటు వేసింది. 2023లో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే స్వీడన్ లో సునీల్ పర్యటించారని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ఆ తర్వాత కూడా జార్జియాకు వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్న సునీల్.. జార్జియాకు కాకుడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) టూర్ కు వెళ్లారట. ఇక ఓ సారి ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికాలో పర్యటించిన సునీల్…మరోమారు అమెరికాకు వెళతానని పర్మిషన్ తీసుకుని.. బ్రిటన్ వెళ్లారట. ఇలా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పలుమార్లు.. మరికొన్నిసార్లు తప్పుడు సమాచారం ఇచ్చి విదేశాలకు వెళ్లిన సునీల్… సివిల్ సర్వీసెస్ అధికారుల కోడ్ ఆఫ్ కాండక్ట్ ను అతిక్రమించారని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ కారణంగానే సునీల్ పై సస్పెన్షన్ విధిస్తున్నట్లుగా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదిలా ఉంటే… సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో తనకు సన్నిహితంగా ఉన్న కామేపల్లి తులసిబాబును సీఐడీ కార్యాలయానికి సునీల్ పిలిపించారని ఆరోపణలు ఉన్నాయి. భారీకాయుడన తులసిబాబును రఘురామ గుండెలపై కూర్చోబెట్టి మాజీ ఎంపీ హత్యకు యత్నించారన్న ఆరోపణలు కూడా సునీల్ పై ఉన్నాయి. ఇక ఐపీఎస్ అధికారిగా ఉంటూనే… ఓ మతాన్ని ప్రమోట్ చేస్తూ సునీల్ పలు పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ విషయంపైనా గతంలోనే పలు వివాదాలు రేగాయి. ఓ ఐపీఎస్ అదికారిగా ఉంటూ ఇలా ఒక మతాన్ని ఎలా ప్రమోట్ చేస్తారన్న ప్రశ్నలకు సునీల్ దురుసుగానూ సమాధానాలిచ్చారన్న వాదనలూ లేకపోలేదు. ఇన్నేసి వివాదాల నేపథ్యంలో సునీల్ పై సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం.