ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్టణం.. వర్తక వాణిజ్యాలకే కాకుండా పర్యాటకంగానూ దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ పరిధిలోని తీరం వెంట బీచ్ లన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యాయి. వాటిలో అన్నింటికంటే కూడా ప్రత్యేకమైనది రిషికొండ బీచ్. రిషికొండ బీచ్ లో కూడా ఓ 600 మీటర్ల తీరానికి మొన్నటిదాకా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు… వాటిని కాపాడుతూ ప్రభుత్వం చేపట్టిన చర్యలను చూసి ముచ్చటపడిన డెన్మార్క్ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఏఏ) ఆ ప్రాంతానికి బ్లూ ఫాగ్ పేరిట ఓ ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. ఈ గుర్తింపుతో అక్కడ బ్లూ ఫ్లాగ్ పతాకం కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది.
అయితే ఇటీవల సదరు బ్లూ ఫాగ్ పతాకం కనిపించడం లేదు. కారణమేమిటని ఆరా తీస్తే.. అక్కడికి వెళుతున్న పర్యాటకులు గతంలో మాదిరిగా బాద్యతగా వ్యవహరించడం లేదని తేలింది. దానికి తోడు పర్యాటక శాఖ అధికారులు అక్కడి పరిస్థితులను పట్టించుకున్నపాపాన పోలేదన్న చేదు నిజం కూడా వెలుగు చూసింది. ఫలితంగా ఆ ప్రాంతంలో శునకాలు యథేచ్ఛగా తిరుగాడుతున్నాయి. టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదులు దుర్గంధంతో నిండిపోయాయి. ఈ పరిస్థితులను చూసి ఆవేదనకు గురైన కొందరు టూరిస్టులు… అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టేలా ఫొటోలు తీసి వాటిని నేరుగా ఎఫ్ఏఏకు పంపారట. ఈ ఫొటోలను పరిశీలించిన ఎఫ్ఏఏ… రిషికొండ బీచ్ కు 2020లో ఇచ్చిన బ్లూఫాగ్ గుర్తింపును రద్దు చేశారట. ఈ క్రమంలోనే అక్కడి బ్లూఫాగ్ పతాకం మాయమైందట.
వాస్తవానికి కూటమి సర్కారు పాలన మొదలయ్యాక ఏపీలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నడూ లేనిది ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ పర్యాటక శాఖ మంత్రి హోదాలో సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పర్యాటక రంగానికి సరికొత్త జవసత్వాలను తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే బ్లూఫాగ్ హోదా కలిగిన రిషికొండ బీచ్ కు ఆ గుర్తింపు రద్దు కావడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎంత డ్యామేజీ జరిగినా ఫరవా లేదు గానీ… శ్రద్ధ పెడుతున్న కూటమి లాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు జరగడం నిజంగానే కొంత ఇబ్బందేనని చెప్పాలి. ఇప్పటికైనా సీఎం నారా చంద్రబాబునాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ లు దీనిపై దృష్టి సారించి రిషికొండకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.