పోసాని నాట‌కాలాడారు..: పోలీసులు

విద్వేష పూరిత వ్యాఖ్య‌లు, దూష‌ణ‌ల కేసులో అరెస్ట‌యిన న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, వైసీపీ మాజీ నాయ‌కుడు పోసాని కృష్ణ ముర‌ళిపై క‌డ‌ప జిల్లా రైల్వే కోడూరు రూర‌ల్ పోలీసులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ కేసులో త‌మ క‌స్ట‌డీలో ఉన్న పోసాని అన్నీ అబ‌ద్ధాలు, సినిమా టిక్ డైలాగుల‌తో త‌మ‌ను మ‌భ్య‌పుచ్చే ప్ర‌య‌త్నం చేశార‌ని అన్నారు. త‌న‌కు లేని శారీర‌క బాధ‌ల‌ను ఆయ‌న ఏక‌రువు పెట్టార‌న్నారు. బిర్యానీ అడిగారు. త‌ర్వాత‌.. కూల్ డ్రింక్ ఇమ్మ‌న్నారు. ఆ త‌ర్వాత‌.. క‌డుపునొప్పి అని చెప్ప‌డంతో ముందు ఖంగారు ప‌డ్డాం. దీంతో ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు చేయించాం. కానీ, అస‌లు నాట‌కం అక్క‌డ తెలిసింది అని రైల్వే కోడూరు సీఐ వెంక‌టేశ్వ‌ర్లు చెప్పారు.

అంతేకాదు.. పోసానిని ప‌రీక్షించిన వైద్యులు కూడా.. ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నార‌ని చెప్పిన‌ట్టు తెలిపారు. ఆ త‌ర్వాత‌.. మ‌ళ్లీ గుండెల్లో న‌ల‌త‌గా ఉందంటే.. అది కూడా చేయించిన‌ట్టు చెప్పారు. కానీ, ఎలాంటి నొప్పులూ లేవ‌ని.. ఆయ‌న నాట‌కాలు ఆడుతున్నార‌ని తెలిపారు. ఇలా .. తమ విచార‌ణ‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డం, త‌మ‌ను ఆందోళ‌న‌కు గురి చేయ‌డంపై కూడా కేసు న‌మోదు చేస్తామ‌న్నారు. అయితే.. ఉన్న‌తాధికారుల‌కు ఈ విష‌యాలుతెలియ‌జేసి.. ఆ త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. విచార‌ణ‌లో ఉన్న వ్య‌క్తి ఎవ‌రైనా పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని..కానీ, త‌మ‌నే ఇబ్బంది పెడుతున్నార‌ని సీఐ వ్యాఖ్యానించారు.

కాగా.. పోసాని.. శ‌నివారం పోలీసుల విచార‌ణ‌లో త‌న‌కు అనారోగ్యంగా ఉంద‌ని.. గుండెపోటు వ‌స్తోంద‌ని చెప్ప‌డంతో పెద్ద ఎత్తున ఆయ‌న అరెస్టుపైనా.. పోలీసుల విచార‌ణ‌పైనా వార్త‌లు వ‌చ్చాయి. ఏదోజ‌రుగుతోంద‌న్న వాద‌న కూడా వైసీపీ వ‌ర్గాల నుంచి వినిపించింది. పోసానికి ఏదైనా జ‌రిగితే.. దానికి ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలంటూ.. వైసీపీ నాయ‌కులు కూడా.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా సీఐ వెంక‌టేశ్వ‌ర్లు ఇచ్చిన వివ‌ర‌ణ‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. మ‌రోవైపు వైద్య ప‌రీక్ష‌లు ముగిసి.. రిపోర్టులు వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ పోసానిని.. స‌బ్ జైలుకు త‌ర‌లించారు. ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే.