మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇతరత్రా పార్టీల పరిస్థితి ఎలా ఉన్నా… ఇప్పటికీ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే… దేశ రాజకీయాల్లోనే పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా జనసేన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది, ఎన్నికల్లో జనసేన 2 ఎంపీ సీట్లు, 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. ఫలితాల్లో ఈ అన్ని స్థానాల్లో విజయం సాధించి… 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన నిలిచింది. అంతేనా.. టీడీపీతో పాటుగా బీజేపీ అభ్యర్థుల విజయాల్లోనూ జనసేన కీలక భూమిక పోషించిందనే చెప్పాలి. వెరసి కూటమిలో కీలక భాగస్వామిగానే… గెలుపు గుర్రంగా జనసేన సరికొత్త ట్యాగ్ లైన్ ను అందుకుంది.
సరే… ఇదంతా ఇప్పుడు ఎందుకూ అంటే… ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోంది కదా. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే ఈ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం కాకినాడలో ఆవిర్భావ సభల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీకి చెందిన ఉభయ గోదావరి జిల్లాల ముఖ్య నేతలు, పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు పాలుపంచుకున్న ఈ సమావేశంలో ఆవిర్భావ సభల పోస్టర్ ను నాదెండ్ల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం జనసైనికులను ఉర్రూతలూగించిందని చెప్పక తప్పదు.
ఈ దఫా జరగనున్న జనసేన ఆవిర్భావ సభలు ”ఏపీ భవిష్యత్తు జనసేన” అన్న కాన్సెప్టుతో నిర్వహిస్తున్నామని నాదెండ్ల ప్రకటించారు. రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయం చేయాలని నిర్ణయించిన పవన్… ఆ దిశగానే అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పారు. పవన్ బాటలోనే పార్టీ శ్రేణులు సాగాల్సి ఉందన్నారు. ఆవిర్భావ సభకు జనాన్ని తరలించాల్సిన అవసరం జనసేనకు లేదని నాదెండ్ల సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ ఆదర్శవంత రాజకీయాలే… సభకు జనాన్ని తరలివచ్చేలా చేస్తాయన్నారు. ఇక పదవులు ఆశించి పార్టీలోకి రావాలనుకునే వారు ఎవరైనా ఉంటే… వారు తమలోని ఆ భావనను తీసివేసిన తర్వాతే పార్టీలో చేరాలని ఆయన సూచించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న పవన్ పదవులను ఆశించే నేత కాదని కూడా నాదెండ్ల చెప్పుకొచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates