వైసీపీ నేతలకు అనిత మాస్ వార్నింగ్!

2024 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం వైసీపీని ఒక్కొక్కరూ వీడుతోన్న సంగతి తెలిసిందే. బాలినేని మొదలు మోపిదేవి వరకు జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా, వైసీపీలో అంతర్యుద్ధం మొదలై పీక్స్ కు చేరుకుంటున్న తరుణంలో కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైంది అంటూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలకు హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు.

కూటమిలో అంతర్యుద్ధం లేదని.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా వైసీపీ నేతలు చూసుకోవాలని హోం మంత్రి అనిత చురకలంటించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదని, ఇది ఎన్డీయే ప్రభుత్వమని అన్నారు. వాక్ స్వాతంత్ర్యం ఉందని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలెవరూ రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.

ఇక, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అనిత వెల్లడించారు. తాము కక్షా రాజకీయాలకు పాల్పడడం లేదని, తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని క్లారిటీనిచ్చారు. పోసానికి సజ్జల రామకృష్ణారెడ్డి లేదా మరెవరో స్క్రిప్ట్ ఇచ్చినా…అనుభవించేది ‘రాజా’నే అంటూ పోసానిపై సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో పోలీస్ శాఖలో 900 కోట్లు బకాయి పెట్టారని, అవన్నీ తాము తీరుస్తున్నామని అన్నారు. ఏపీకీ ‘అప్పా’ లేదని, గ్రే హౌండ్స్ బెటాలియన్ లేదని, త్వరలో ‘అప్పా’కు భూమి పూజ చేస్తామని అనిత తెలిపారు.