వైఎస్ కుటుంబంలో కొన్నాళ్లుగా కలకలం రేపుతున్న ఆస్తుల వివాదంలో వైఎస్ సతీమణి, జగన్ మాతృ మూర్తి.. విజయమ్మ ఫుల్లుగా యూటర్న్ తీసుకున్నారు. సదరు ఆస్తులతో జగన్‌కు కానీ.. ఆయన సతీమణి భారతికి కానీ.. సంబంధం లేదని.. ట్రైబ్యునల్‌లో అఫిడవిట్ వేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇది కనుక కోర్టు ఆమోదం పొందితే.. కీలకమైన సరస్వతి భూముల విషయం, వాటాల విసయంలో వైసీపీ అధినేతకు భారీ దెబ్బే తగలనుందని అంటున్నారు.
సరస్వతి పవర్ లో వాటాల విషయం గత ఆరు మాసాలుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తను ప్రేమతో ఇచ్చిన వాటాను బదలాయించుకునే ప్రయత్నం చేసి.. తన బెయిల్ రద్దు చేయాలన్న కుట్ర చేస్తున్నారంటూ.. ఆరు మాసాల కిందట.. జగన్ ఎన్‌సీటీఎల్‌లో దావా వేసిన విషయం తెలిసిందే. తనపై 2012లో నమోదైన అక్రమాస్తుల కేసులో సరస్వతీ భూములు సహా వాటాలను సీబీఐ, ఈడీలు.. తమ స్వాధీనంలో ఉంచుకున్నాయని.. ఇప్పుడు వాటిని వేరేవారికి కేటాయిస్తే.. తన బెయిల్ రద్దయి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కూడా గతంలో ఆరోపించారు.
అప్పట్లో ఈ వివాదం తీవ్ర స్థాయిలో రాజుకుంది. కన్న తల్లిని, చెల్లిని కూడా ఆస్తుల కోసం జగన్ కోర్టుకు లాగారంటూ.. ప్రత్యర్థి పక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ఇదే కేసులో విజయమ్మ సంచలన అపిడవిట్ వేశారు. జగన్ వేసిన పిటిషన్‌నే ఆమె తప్పుబట్టారు. సరస్వతి భూములు కంపెనీలో వాటాలు పూర్తిగా తనవేనని(97.3 శాతం) విజయమ్మ పేర్కొన్నారు. అంతేకాదు.. జగన్, భారతిలకు ప్రస్తుతం ఎలాంటి వాటాలేలూ లేవని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసలు ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదన్నారు.
అంతేకాదు.. అమాయకురాలైన తన కుమార్తె షర్మిల పేరును ఈ కేసులో ఇరికించే ప్రయత్నాన్ని కూడా విజయమ్మ ఖండించారు. ‘సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్’ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని తెలిపారు. తమ వాటాలను షర్మిలకు ఉదారంగా బదాలిస్తున్నట్టు ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్, భారతిలపై విజయమ్మ ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ లో ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది నిరూపణ అయి.. జగన్‌కు కనుక వాటాలు లేకపోతే.. ఆర్థికంగా ఆయనకు నష్టం. అదేసమయంలో రాజకీయంగా కుటుంబాన్ని వేదించారన్న అపప్రద కూడా ఎదురవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates