విచారణకు రమ్మంటే గోరంట్ల ఏమన్నారంటే?

ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా… వీర విహారం చేసిన ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలపై కేసులు నమోదు కాగా… గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో పాటు మాజీ ఎంపీ నందిగం సురేశ్, తాజాగా వైసీపీని వీడిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయ్యారు. ఇక కేసులు నమోదు అయిన వైసీపీ నేతల సంఖ్యకు అయితే లేక్కే లేదని చెప్పాలి.

తాజాగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది. 2019 ఎన్నికల దాకా ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారిగా ఉన్న మాధవ్… తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో నెలకొన్న వివాదంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన మాధవ్.. వైసీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ కు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చిన జగన్.. ఆయనను ఏకంగా పార్లమెంటుకే పంపారు. దీంతో జగన్ ఆదేశానుసారం మాధవ్ ఓ రేంజిలో స్వైర విహారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కియా పరిశ్రమ ప్రతినిధులకు మాధవ్ బెదిరింపుల వీడియో వైరల్ కాగా.. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణరాజుకు పార్లమెంటు ఆవరణలోనే బెదిరింపులు, ఓ మహిళతో దిగంబరంగా మాట్లాడిన వీడియో కాల్… మాధవ్ కెరీర్ ను సర్వ నాశనం చేశాయన్న వాదనలు ఉన్నాయి.

పోలీసుల నుంచి తాఖీదులు అందుకుంటున్న వైసీపీ నేతల జాబితాలో ఇప్పుడు మాధవ్ కూడా చేరిపోయారు. మార్చి 5న తమ ముందు విచారణకు హాజరు కావాలని అనంతపురం సైబర్ క్రైమ్ పోలీసులు మాధవ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం మాధవ్ ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫోక్సో కేసులో బాధితురాలి పేర్లను వెల్లడిండానికి వీల్లేదు. ఆ నిబంధనను అతిక్రమించిన మాధవ్ ఓ ఫోక్సో కేసులో బాధితురాలి పేరును బహిర్గతం చేశారు. దీంతో గతేడాది మాధవ్ పై మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే… ఈ నోటీసులపై మాధవ్ ఘాటుగా స్పందించారు. పోలీసుల నుంచి నోటీసులు తీసుకున్నానని ఆయన తెలిపారు. అంతటితో ఆగని ఆయన విచారణకు హాజరయ్యే తేదీని మార్చాలని కోరతానన్న మాధవ్.. న్యాఃయ నిపుణుల సలహాలు తీసుకున్నాకే విచారణకు హాజరయ్యే విషయాన్ని ఆలోచిస్తానని తెలిపారు. అప్పటిదాకా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించిన మాధవ్… రాష్ట్రంలో అంతర్యుద్ధం రాబోతోందని కూడా ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆయన వ్యాఖ్యానించారు.