అనారోగ్యం అంటూనే… ‘నార్కో’కు సిద్ధమంటున్నారే

దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వంశీని తమ కస్టడీకి అనుమతించాలని పోలీసులు కోరగా… వంశీకి కోర్టు 3 రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ కస్టడీ గురువారం సాయంత్రానికి పూర్తి కాగా… వైద్య పరీక్షల అనంతరం వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వంశీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కస్టడీలో పోలీసులు ఏమైనా అతిగా వ్యవహరించారా? అని కోర్టు ప్రశ్నించగా… అదేమీ లేదని వంశీ చెప్పారు. ఆ తర్వాత తనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని చెప్పిన వంశీ… అవసరమైతే తనను తాను నిరూపించుకునేందుకు నార్కో అనాలసిస్ పరీక్షకు కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. ఈ మేరకు తానే తనకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని కూడా ఆయన తెలిపారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఓ వైపు చెబుతూనే… నార్కో టెస్టు కోసం తానే పిటిషన్ దాఖలు చేస్తానని వంశీ చెప్పడం నిజంగానే పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదిలా ఉంటే… తనను ప్రస్తుతం ఉంచిన బ్యారక్ లో కాకుండా వేరే బ్యారక్ కు మార్చాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పిన వంశీ… ఇప్పుడున్న బ్యారక్ లో ఒంటరిగా ఉండటం కష్టంగా ఉందని తెలిపారు. ఈ కారణంగా తనను వేరే బ్యారక్ కు అది కూడా… ఇతరులతో కలిసి ఉండేలా మరో బ్యారక్ కు మార్చాలని కోరారు. ఈ మేరకు మెమో దాఖలు చేయాలని వంశీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ ముగిసిన తర్వాత వంశీ ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

ఇదిలా ఉంటే… 3 రోజుల విచారణలో భాగంగా పోలీసులు వందలాది ప్రశ్నలు సంధించినా… వంశీ నుంచి వాటిలో చాలా ప్రశ్నలకు సరైన సమాధానమే రాలేదని సమాచారం. ఈ సమాధానాలు సంతృప్తిగా లేవని కూడా పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వంశీని మరోమారు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్నిసార్లు, ఎన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నా.. సత్యవర్ధన్ కిడ్నాప్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ చెబుతున్న తీరుపై పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎన్ని ఆధారాలు ముందు పెట్టినా వంశీ ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదని భావిస్తున్న పోలీసులు.. ఈ దఫా ఇతర నిందితులతో కలిపి వంశీని విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.