జగన్ మాటంటే శాసనంగా.. లక్షణ రేఖలు భావించే వైసీపీ నాయకులు.. ఇటీవలి పరిణామాల క్రమంలో ఆయన మాటను పెద్దగా పట్టించుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవరి మాటా వినకుండా.. గత ఎన్నికల్లో తనకు నచ్చినట్టు వ్యవహరించిన జగన్..పార్టీ నాయకులను ముంచేశారన్న వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విషయం నుంచి సర్కారుపై పోరాడే వరకు కూడా.. జగన్ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంటున్నారని నాయకులు చెబుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంటివారు.. ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. ఒకరిద్దరు మాత్రం నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి జగన్ వైఖరి మారలేదన్నది.. పార్టీలోనే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే.. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణాజిల్లాల్లో వైసీపీ పోటీ చేయలేదు. వాస్తవానికి ఇక్కడ పోటీ పెట్టాలని ఆది నుంచి నాయకులు కోరారు.
కానీ, జగన్ ఎవరి మాటా వినలేదు. పైగా.. ఎన్నికలకు నాలుగురోజుల ముందు.. పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు వైసీపీ మద్దతు ఇస్తోందని చెప్పుకొచ్చారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అందరూ.. తమ ఓటును లక్ష్మణరావుకు వేయాలని ఆయన సూచించారు. అంతేకాదు.. ఒక్కొక్కరు మరో మూడు ఓట్లు వేయించా లని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. జగన్ ఆదేశాలకు అందరూ తలలూపారు. లక్ష్మణరావును గెలిపించే బాధ్యతను తీసుకుంటామనిచెప్పారు.
కానీ, తీరా గురువారం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యాక.. వైసీపీ పట్టభద్రులు ఎవరూ కూడా బూతుల వద్ద కనిపించలేదు. అంతేకాదు.. అసలు చాలా మంది కీలక నాయకుల ఫోన్లు కూడా మూగబో యాయి. అంటే స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీనిని బట్టి.. జగన్ చెప్పింది.. వారు వినలేదన్న వాదన వినిపిస్తోంది. జగన్ ఎంత చెప్పినా.. పనిచేయకపోవడం గమనార్హం. వారంతా లైట్ తీసుకున్నారు. ఎక్కడ పోలింగ్ బూతును పరిశీలించినా.. మధ్యాహ్నం 1 గంట సమయానికి కేవలం టీడీపీ సానుకూలురు.. కూటమి పార్టీ సానుకూలురే ఎక్కువగా కనిపించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.