ఉత్తరాది అంటే దక్షిణాదికి పడదు. అదే సమయంలో దక్షిణాది అంటే ఉత్తరాదికి పడదు. హిందీ అంటే తమిళులకు పడదు. కన్నడ అంటే మరాఠాలకు అస్సలు పడదు. అయినా కూడా అందరూ కలిసే భారత్ లో నివసిస్తున్నారు. ఎప్పుడో అనుకోని పరిస్థితుల్లో కొందరు ఆకతాయిల కారణంగా ఈ తరహా విబేధాలు పొడచూపుతున్నాయి గానీ.. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య సోదర భావం వెల్లి విరుస్తోంది. అందుకు నిదర్శనం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో సాక్షాత్కరించింది. దేశ రాజకీయాలను శాసిస్తున్న యూపీలాంటి రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడికక్కడ తెలుగు సూచిక బోర్డులు కనిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ అంటేనే..వారణాసి, కేదార్ నాథ్, ప్రయాగ్ రాజ్ లాంటి ప్రసిద్ధ ఆలయాలకు ప్రసిద్ధి. అక్కడికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా వెళుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో అందరూ హిందీ, ఇంగ్లీష్ చదువు తెలిసిన వారే ఉండరు కదా. మరి అటు హిందీ, ఇటు ఇంగ్లీష్ రాని ప్రయాణికులు దారి కనుక్కోవడం ఎలా? కనిపించిన వారందరినీ అడుక్కుంటూ మరీ వెళ్లాలా? ఇదే ఆలోచన వచ్చిందో, ఏమో తెలియదు గానీ… మహాకుంభమేళాను పురస్కరించుకుని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు పలు కీలక చర్యలు చేపట్టింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు యూపీలో ప్రవేశించినా.. ప్రసిద్ధ ప్రదేశాలకు దారి చూపేలా ప్రత్యేకంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది.
ఈ దిశగా ఏర్పాటు చేసిన తెలుగు సూచిక బోర్డులు బుధవారం వెలుగు చూశాయి. అయితే సరిగ్గా బుధవారమే ప్రయాగ్ రాజ్ కేంద్రంగా పరమ పవిత్రంగా కొనసాగిన మహాకుంభమేళా ముగిసిపోయింది. కుంభమేళా చివరి రోజున భక్తులు అదిక సంఖ్యలో వస్తారని అంచనా వేసిన యోగీ సర్కారు…మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తెలుగు నేల నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లిన ఎవరో భక్తులు… అక్కడ తెలుగులో రాసిన ఉన్న సైన్ బోర్డులను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.