లోకేశ్ దెబ్బకు వైసీపీ వణికిపోతోందిగా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ దెబ్బకు వైసీపీ నిజంగానే వణికిపోతోందని చెప్పక తప్పదు. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరే నిదర్శనమని చెప్పక తప్పదు. ఇప్పటికే 11 మందితో కూడిన వైసీపీ శాసన సభా పక్షం సమావేశాలకు హాజరయ్యేందుకే వణికిపోతోంది. ఏదో 60 రోజుల నిబంధనతోనే వైసీపీ సభ్యులు సోమవారం నాటి సభకు వచ్చారే తప్పించి… మంగళవారం నాటి సమావేశాల వైపే వారు కన్నెత్తి చూడలేదు. ఇలా సభకు రాకపోవడానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడమే కారణమని వైసీపీ చెబుతున్నా… సభకు వచ్చి అదే అంశంపై పోరాటం చేయవచ్చు కదా అన్న డిమాండ్లు ఒకింత గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే శాసనమండలిలో మెజారిటీ ఉన్న వైసీపీ నిర్మాణాత్మక ఆరోపణలు చేయడంలో ఎందుకు విఫలమవుతోందన్న ప్రశ్నలూ ఇప్పుడు కొత్తగా తెర మీదకు వస్తున్నాయి.

మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాలు ప్రారంభం కాగా… అవకాశం వచ్చినా కూడా దానిని వైసీపీ సద్వినియోగం చేసుకోలేకపోతోందని చెప్పాలి. వైసీపీ తరఫున మాట్లాడిన వరుదు కల్యాణి గానీ, చంద్రశేఖర రెడ్డి గానీ.. అధికార పక్షాన్ని నిర్మాణాత్మక ప్రశ్నలతో నిలువరించలేకపోయారు. ఏదో అధికార పక్షాన్ని తమదైన శైలి ఆరోపణలతో టార్గెట్ చేయడానికి యత్నించిన వైసీపీ వాదనలను ఎప్పటికప్పుడు లోకేశ్ సమర్థంగా తిప్పికొట్టిన తీరు ఆకట్టుకుంది. నోటి మాటలతో కాకుండా ఆధారాలతో విపక్షం ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పిన లోకేశ్… అదే సమయంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులతో పాటుగా ఎంతో అనుభవం ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా బదులు ఇచ్చేందకు నానా తంటాలు పడ్డారు.

కేంద్రం నుంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువచ్చే విషయంలో అయినా… విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామాల విషయంలో అయినా వైసీపీ వాదనలను లోకేశ్ సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఒకేసారి వర్సిటీల వీసీల రాజీనామాలకు బెదిరింపులే కారణమన్న చంద్రశేఖరరెడ్డి ఆరోపణలకు వేగంగా స్పందించిన లోకేశ్… అందుకు ఆధారాలు ఇవ్వాలంటూ విపక్షాన్ని నిలదీశారు. ఈ సమయంలో కల్పించుకున్నబొత్స విచారణకు ఆదేశాలు జారీ చేయాలని కోరగా.. ఆధారాలు లేకుండా వైసీపీ చెప్పిన ప్రతి అంశం ఆధారంగా విచారణలకు ఆదేశిస్తూ సాగలేమని తేల్చి చెప్పారు. ఆధారాలు ఉంటే ఇస్తే.. విచారణకు తనకేమీ అభ్యంతరం లేదని, ఆధారాలు ఇస్తే.. ఇక్కడికిక్కడే విచారణకు ఆదేశాలు ఇస్తానని లోకేశ్ చెప్పడంతో బొత్స కూడా బదులు చెప్పలేక అలా కూర్చుండిపోయారు. మొత్తంగా తనదైన శైలిలో సత్తా చాటిన లోకేశ్… మెజారిటీ ఉన్న మండలిలోనూ వైసీపీని వణికించేశారని చెప్పక తప్పదు.