ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగం మధ్యలోనో వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పోడియం దగ్గర వైసీపీ సభ్యులు చేసిన రచ్చపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తీరును అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎండగట్టారు.
వైసీపీ సభ్యుల తీరుపై అయ్యన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే పోడియం దగ్గరకు వచ్చి పేపర్లు చింపి పోడియంపైకి విసిరేశారని, వైసీపీ సభ్యులు సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా, సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని, తన పార్టీ సభ్యులను గొడవ చేయాల్సిందిగా ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తుంటే నవ్వుతూ కూర్చున్నారని విమర్శించారు.
సభకు అతిథిగా వచ్చిన గవర్నర్ వంటి ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచేలా ప్లకార్డ్స్ పట్టుకొచ్చారని, ఇది ఏం సంప్రదాయమని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. అయితే, ఇదంతా చూస్తున్న సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ కూడా జగన్ ను వారించకపోవడం సరికాదని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగటానికి వీల్లేదని అన్నారు. ఇకపైన జగన్ విజ్ఞతతో వ్యవహరించాలని హితవుపలికారు.
రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయన్నట్లు జగన్ ప్రవర్తించటం తగదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలుంటే చర్చలో పాల్గొనాలని, ఇలా ప్రవర్తించకూడదని చెప్పారు. వైసీపీ తీరును ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక, ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై అయ్యన్న సీరియస్ అయ్యారు. సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. సభా హక్కుల కమిటీకి సాక్షి కథనాలను స్పీకర్ రిఫర్ చేశారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరగకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని సాక్షిలో కథనాలు రావడంపై అయ్యన్న స్పందించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates