ఏపీ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సీట్లను గెలుచుకున్న వైసీపీ పరిస్థితిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్ గా కనిపించిన వైసీపీ… ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ బలంతో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. అంటే… ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కనీసం ప్రధాన ప్రతిపక్ష నేత కూడా రాని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ చెప్పిన జగన్… తన వ్యూహాన్ని మార్చుకుని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం నాటి సమావేశాల ప్రారంభం సందర్భంగా తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ సభకు వచ్చారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో మొదలుతాయి కదా. అంటే… అసెంబ్లీ మెయిన్ హాలులో జరిగే గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ సభ్యులు (ఎమ్మెల్యేలు)తో పాటుగా శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) కూడా హాజరవుతారు. అసెంబ్లీలో వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నా… మండలిలో మాత్రం ఆ పార్టీకి ఇప్పటికీ 36 మంది సభ్యులు ఉన్నారు. గవర్నర్ ప్రసంగం ఉండటంతో 10 మంది ఎమ్మెల్యేలు, 36 మంది ఎమ్మెల్సీలతో కలిసి జగన్ అలా అసెంబ్లీకి గ్రాండ్ గానే ఎంట్రీ ఇచ్చారు. సభలోనూ మొత్తంగా రెండు సభల్లోని తన పార్టీ సభ్యులు కూర్చోవడంతో రెండు వరుసల మేర వైసీపీ సభ్యులు కనిపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ వస్తున్న సందర్భంగానూ ఆ పార్టీ సంఖ్యాబలం ఘనంగానే కనిపించింది. ఫరవా లేదు… ఈ మాత్రం బలం ఉంటే ఇక నడిపించేయొచ్చు అన్న భావన వైసీపీ శ్రేణుల్లో కనిపించింది.
అయితే మంగళవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు వేర్వేరుగానే జరుగుతాయి కదా. అంటే అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, శాసన మండలి సమావేశాలకు ఎమ్మెల్సీలు విడివిడిగానే హాజరు అవుతారు. అంటే… రేపు కూడా వైసీపీ అసెంబ్లీకి వస్తే.. అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య జగన్ తో కలుపుకున్నా 11 మాత్రమే అవుతుంది. అంటే… అసెంబ్లీలో ఒక్కటంటే ఒక్క వరుస కుర్చీలు కూడా నిండని పరిస్థితి. ఇక మండలి విషయానికి వస్తే 36 మంది సభ్యులతో ఉన్న వైసీపీ మరింత కాలం పాటు మండలిలో ఓ రేంజిలో సత్తా చాటే అవకాశం అయితే ఉంది. వరుసగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయిపోతూ ఉంటే.. ఆ సీట్లన్నీ దాదాపుగా అధికార పక్షం ఖాతాలో పడిపోతూ ఉంటాయి. ఫలితంగా ఇప్పుడు కాకున్నా సమీప భవిష్యత్తులోనే మండలిలోనూ వైసీపీ బలహీనంగా మారిపోయే ప్రమాదం లేకపోలేదు.