ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నిర్దేశిత సమయానికే ప్రారంభం అయిపోయాయి. బడ్జెట్ సమావేశాలు కావడం, సమావేశాల ప్రారంభ రోజు కావడం, గవర్నర్ ప్రసంగం ఉండటంతో సోమవారం దాదాపుగా అటు ఎమ్మెల్యేలతో పాటుగా ఇటు ఎమ్మెల్సీలంతా సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ మెయిన్ హాలులో ప్రారంభం అయిన ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు కూడా కలిసి కూర్చున్నారు. వెరసి సభ నిండుగా కనిపించింది. ఇక రెండు రోజుల క్రితం ప్రకటించినట్లుగానే సభకు వైసీపీ సభ్యులతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పులివెందుల ఎమ్మెల్యే హోదాలో సభకు హాజరయ్యారు. ఇక కూటమి పార్టీలకు చెందిన సభ్యులు కూడా అందరూ సభకు వచ్చేశారు.
ఇదంతా బాగానే ఉన్నా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ఓ పొరపాటును దొర్లించేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఏటా గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాలను సోమవారం గవర్పర్ తన ప్రసంగంతోనే మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా శాసనమండలి చైర్మన్, శాసన సభ స్పీకర్ లకు ధన్యవాదాలు తెలిపిన అనంతరం సభ్యులకు స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన క్లిష్టర్ క్లియర్ మెజారిటీని కూడా గవర్నర్ ఒకింత ఆసక్తిగానే ప్రస్తావించారు.
ఆ తర్వాత కూటమిలోని ప్రధాన పార్టీలను ప్రస్తావిస్తూ.. తొలుత సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పేరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు అని పలకాల్సిన గవర్నర్… ‘నరేంద్ర’ చంద్రబాబు నాయుడు అంటూ పొరపాటుగా పలికారు. అనంతరం జరిగిన పొరపాటును గవర్నర్ గ్రహించినట్లున్నారు. కాసేపు మౌనం వహించిన ఆయన.. దొర్లిన పొరపాటును సరిదిద్దకుండానే తన ప్రసంగాన్ని కొనసాగించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించిన గవర్నర్… ఆ తర్వాత బీజేపీ పక్షాన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించారు. ఈ పార్టీల కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతును తెలిపారంటూ గవర్నర్ పేర్కొన్నారు.