ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సోమవారం ఉదయం ప్రారంభం కాగానే.. ఉభయ సభలను ఉద్దేశించి.. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించా రు. లెక్కలేకుండా చేసిన అప్పుల కారణంగా.. రాష్ట్రం ఆర్థిక దుస్థితిలోకి వెళ్లిందన్నారు. కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చిన పన్నులను కూడా.. దేనికి ఖర్చు చేశారన్నది లెక్కలేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
కేంద్ర పథకాలను వినియోగించకుండా.. ఆ పథకాలను కూడా నాశనం చేశారని.. తద్వారా.. రాష్ట్రంలో అభివృద్ది లేకుండా పోయిందన్నారు. అంతేకాదు.. తద్వారా, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చోటు చేసుకుందని చెప్పారు. ఇప్పుడు తమ ప్రబుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వ్యవస్థలు విధ్వంసం అయిపోయిన నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ.. రాష్ట్ర అభివృద్ది కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు.
ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం చెప్పిన సూత్రాన్ని గవర్నర్ ప్రస్తావించారు. అవకాశం ఇస్తే.. ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలు వెలుగు చూస్తాయని.. అభివృద్ధికి బాటలు పడతాయని పేర్కొన్నారు. అందుకే.. రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యాల వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పేదరికాన్ని 0 స్థాయికి తీసుకురావా లన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గవర్నర్ చెప్పారు. అదేవిధంగా వికసిత్ భారత్‌లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
33 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని దీనిపై బిల్లును రూపొందించి కేంద్రానికి పంపించామని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదని, ప్రతి ఒక్కరికీ ఆహారం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను తీసుకువచ్చినట్టు గవర్నర్ పేర్కొన్నా రు. గత 7 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు మూడు పూటలా కడుపునిండా ఆహారం అందుతోందని గవర్నర్ తెలిపారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. అదేవిధంగా వారికి ఉపాధి,ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. ఐటీ నుంచి ఏఐ దిశగా తమ ప్రభుత్వం ఐటీలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇళ్లు లేని వారికి.. పక్కా ఇళ్లు, స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్తు, రహదారుల విషయంలో తమ ప్రభుత్వం లక్ష్యాలు చేరుకునేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.