తెలుగు రాష్ట్రాల మ‌ధ్య `స‌యోధ్య` సాధ్యంకాదా?

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డాల‌తోపాటు విద్యుత్ స‌మ‌స్య‌లు కూడా పెరుగుతున్నాయి. మ‌రో రెండు మాసాల్లో ఎండ‌లు ముద‌ర‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు అంశాలు కూడా.. రెండు రాష్ట్రాల‌కూ కీల‌కంగా మారుతున్నాయి. ఖ‌రీఫ్ సాగు రెండు రాష్ట్రాల్లోనూ ముమ్మ‌రం అవుతోంది. కృష్ణా, గోదావ‌రి ఆయ‌క‌ట్టు ప్రాంతంలో రైతులు సాగుకు సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అయితే.. నాట్లు కూడా ప‌డుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌లాల ప్రాధాన్యం పెరిగింది.

మ‌రోవైపు .. ఎండాకాలం ప్రారంభానికి ముందే.. విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు విద్యుత్ వాడ‌కాన్ని ఇప్ప‌టి నుంచే పెంచుతున్నాయి. ప‌గ‌టి పూట తీవ్ర ఎండ‌, రాత్రి వేళ‌లలో చ‌లి తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌గ‌టి పూట విద్యుత్ వాడ‌కం గ‌త వారం రోజులుగా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య అటు నీరు, ఇటు విద్యుత్ విష‌యంపై కూడా.. ర‌గ‌డ ప్రారంభ‌మైంది. అయితే.. ఇది తీవ్ర వివాదంగా మారక ముందే ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంద‌ని.. నిపుణులు చెబుతున్నారు.

మ‌ధ్యే మార్గంగా ఇరు రాష్ట్రాల మంత్రులు చ‌ర్చించుకుని ప‌రిష్కారం దిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని సూచిస్తున్నారు. ఏపీలో దీనిపై ఎలాంటి వివాదాలు లేక‌పోయినా.. తెలంగాణలో మాత్రం జ‌లాల‌పై రాజ‌కీయ చిక్కులు వ‌స్తున్నాయి. ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పుంజుకోవ‌డం.. జ‌లాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డిని ఇర‌కాటంలోకి నెట్టాల‌న్న వ్యూహాలు వంటివి అక్క‌డ ప్ర‌భావం చూపుతున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీకి మేలు చేస్తున్న‌ట్టుగా ఏ చిన్న సంకేతం వ‌చ్చినా.. రేవంత్‌రెడ్డి స‌ర్కారును బ‌ద్నాం చేసేందుకు కేసీఆర్ ముందంజ‌లో ఉన్నారు.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ‌తో పోల్చుకుంటే ఖ‌రీఫ్ ఆయ‌క‌ట్టు ఎక్కువ‌గా ఉంది. పైగా విద్యుత్ వాడకంలోనూ హైద‌రాబాద్‌తో పోటీ ప‌డుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో ఏపీ చ‌ర్చ‌ల‌కు మొగ్గు చూపుతోంది. స‌యోధ్య దిశ‌గానే స‌మ‌స్య ప‌రిష్కారం చేసుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా చెబుతున్నారు. కానీ, ఎటొచ్చీ.. తెలంగాణ‌లో నెల‌కొన్న ప్ర‌త్యేక రాజ‌కీయ ప‌రిస్థితులు.. ఏమేర‌కు ఈ స‌యోధ్య దిశ‌గా అడుగులు వేసేందుకు స‌హ‌క‌రిస్తాయ‌న్న‌ది చూడాలి.