ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయిపోయింది. జనసేన అసెంబ్లీలో తనదైన శైలి 100 శాతం బలంతో అడుగుపెట్టిన తర్వాత సిసలైన అసెంబ్లీ సమావేశాలు ఇవే. ఎందుకంటే.. 2024 ఎన్నికల తర్వాత పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా… విపక్షం అయిన వైసీపీ లేకుండానే సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరైన సభ్యులంతా కూటమిలోని మూడు పార్టీలకు చెందినవారే కావడంతో పెద్దగా రచ్చ లేకుండానే ప్రశాంతంగా సభా సమావేశాలు జరిగాయి. అయితే రేపటి నుంచి జరగనున్న సమావేశాలకు వైసీపీ హాజరవుతోంది. వెరసి ఈ సమావేశాలు జనసేనకు అత్యంత కీలకమైన సమావేశాలుగానే భావించాలి.
అందుకే కాబోలు… సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందుగానే జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతిలో వాలిపోయారు. ఆదివారం సాయంత్రానికే మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న పవన్… జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. సభలో అనుసరించాల్సిన పార్టీ వ్యూహంపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగానే కాకుండా…ఎన్నికల్లో వందకు వంద శాతం సక్సెస్ రేటు సాధించిన పార్టీగా సభలో సత్తా చాటాల్సిన ఆవశ్యకతను ఆయన ఎమ్మెల్యేలకు వివరించారు. విపక్షం చేసే విమర్శలపై అనాలోచితంగా కాకుండా ఒకింత పకడ్బందీగా, వేగంగా స్పందించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇదంతా బాగానే ఉన్నా.. సభలో జనసేన తరఫున గట్టిగా వాణిని వినిపించే వారెవరు? ఈ డౌటనుమానం అందరికీ ఉన్నదే. రాజకీయాలకు కొత్త కాకున్నా… పవన్ సభకు కొత్తే కదా. సభా నియమాలపై ఇప్పటికే ఓ మాదిరిగా పట్టు సాధించిన ఆయన విపక్షాన్ని ఓ ఆట ఆడుకునే సత్తాను సముపార్జించుకున్నారనే చెప్పాలి. ఇక మిగిలిన వారిలో ఓ నలుగురైదుగురు మినహా జనసేన ఎమ్మెల్యేలంతా రాజకీయంతో పాటు సభకూ కొత్తవారే. అయితే ఈ నలుగురైదుగురు ఉన్నారే… వారే జనసేనకు సభలో ఎనలేని బలంగా మారనున్నారని చెప్పాలి. వీరిలో అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ మోస్ట్ నేత కొణతాల రామకృష్ణ అందరికంటే ముందున్నారు. ఎంపీగా, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. మంచి పాలనానుభవంతో పాటుగా ఆయా అంశాలపై మంచి పట్టున్న నేతగా కొణతాలకు పేరుంది.
ఇక మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి మంచి ప్లస్సే. రాజకీయాల్లో చాలాకాలం నుంచి కొనసాగుతున్న నాదెండ్ల విపక్షాల విమర్శలపై ఇట్టే స్పందించే సత్తా ఉన్న నేతగా పేరుంది. అంతేకాకుండా జనసేన వ్యవహారాలన్నీ దాదాపుగా ఈయన చేతుల మీదుగానే కొనసాగుున్నాయి కూడా. జనసేన వాణిని సభలో బలంగా వినిపించడంలో నాదెండ్ల సత్తా చాటడం ఖాయమే. ఇక మరో మంత్రి కందుల దుర్గేశ్ కూడా సభకు కొత్తే అయినా..రాజకీయాలకు కొత్తేమీ కాదు. విపక్షాలను నిలువరించడంలో దుర్గేశ్ ఇప్పటికే తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు కూదా. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న మండలి బుద్ధ ప్రసాద్ కూడా సీనియర్ నేతే. సభా నియమాలు కూడా తెలిసిన నేతగా మండలికి పేరుంది. గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఈయనకు అదనపు బలంగా మారనుంది. ఇక పంతం నానాజీ, లోకం మాధవిలకు సబ్జెక్ట్ పై పట్టున్నా… పెద్దగా వాయిస్ లేదని చెప్పాలి. భవిష్యత్తులో వీరిద్దరూ పార్టీకి కీలక నేతలుగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయి.