బ్రేకింగ్ : అసెంబ్లీకి రానున్న వైఎస్ జగన్!

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న వైసీపీ. అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చేశారు. రానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పార్టీ తరఫున అందరు ఎమ్మెల్యేలు హాజరు కావాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హోరాహోరీగా సాగనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ… అప్పటిదాకా 151 సీట్ల బలంతో బలీయంగా కనిపించగా… ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. సభలో 10 శాతం సీట్లుంటే తప్పించి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని గతంలో జగనే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. నాడు టీడీపీకి 23 సీట్లుండగా… వాటిలోనే కొందరు ప్లేట్ ఫిరాయించేశారు. దీంతో మరో ఇద్దరు ముగ్గురు సభ్యులను తాము లాగేస్తే… టీడీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదని కూడా జగన్ ఎద్దేవా చేశారు.

జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబోమని మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ చెప్పలేదు గానీ… తనకు ఎక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరేమోనని జగనే స్వయంగా అనుమానం వ్యక్తం చేశారు. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా నేత ఇవ్వాల్సిందేనని… అలా అయితేనే సీఎం హోదాలో చంద్రబాబుకు ఇచ్చిన సమయం తనకు కూడా లభిస్తుందని ఆయన వాదించారు. అలాంటి పరిస్థితి లేనప్పుడు తానెందుకు సభకు రావాలని జగనే వ్యాఖ్యానించారు. సభలో అవకాశం దక్కనప్పుడు బయట ఉండి మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని ఆయన చెప్పుకుంటూ వచ్చారు.

అయితే ఈలోగానే ఏమైందో తెలియదు గానీ.. జగన్ తన వ్యూహాన్ని మార్చేసుకున్నారు. ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు, ఆయనకు జైలులో పరామర్శ, గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాటామంతి, ఆపై మన్యం జిల్లాలో పాలవలస రాజశేఖరం కుటుంబానికి పరామర్శ… వరుసబెట్టి ఈ కార్యక్రమాలను చేపట్టిన జగన్ కు జనం నుంచి నీరాజనం లభించింది. జనం నుంచి తనకు వస్తున్న ఆదరణను చూసి అసెంబ్లీకి వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మరి అసెంబ్లీలో ప్రభుత్వంపై జగన్ ఏ రీతిన పోరాటం సాగిస్తారో చూడాలి.