పవన్ మాదిరే కృష్ణ తేజదీ గొప్ప మనసే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ది ఎలాంటి మనస్తత్వమో తెలుసు కదా. ఆపదలో ఉన్నారని తెలిస్తే… ప్రభుత్వమే వచ్చి వారిని ఆదుకోవాలని ఆయన అనుకోరు. తనకు చేతనయినంత సాయం చేసి ఆపదలో ఉన్న వారికి తక్షణ వెసులుబాటు కల్పించడంతో పాటుగా వారిలో బ్రతుకుపై భరోసా నింపుతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఉంటే… ఆయనకు పర్సనల్ సెక్రటరీ హోదాలాో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ తెలుసు కదా. కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణ తేజను పవన్ ఏరికోరి మరీ డిప్యూటేషన్ పై ఏపీకి రప్పించి..తన వద్ద నియమించుకున్నారు. కృష్ణ తేజకు పాలనపై మంచి పట్టు ఉంది. అంతేానా పవన్ మాదిరే ఆయనలో సేవా గుణం కూడా మెండుగానే ఉందని చెప్పాలి. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఓ ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది.

కేరళలో ఉండగా… 2022లో కృష్ణ తేజ ఆ రాష్ట్రంలోని అలెప్పీ జిల్లా కలెక్టర్ గా పని చేశారు. ఆ సమయంలో యావత్తు ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకుంది. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆర్థిక నష్టం కూడా జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఇంకా చాలా కుటుంబాలు కోలుకోలేదనే చెప్పాలి. అప్పటికే పేదరికంలో ఉన్న కుటుంబాలు అయితే ఇక తాము కోలుకోలేమని ఓ భావనకు కూడా వచ్చేశాయి. కరోనాలో అలెప్పీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా 292 మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. వారి జీవన స్థితిగతులను కళ్లారా చూసిన కృష్ణ తేజ… ఓ జిల్లా కలెక్టర్ గా అయినా… లేదంటే ఓ సాధారణ పౌరుడిగా అయినా… ఆ 292 మంది పిల్లలకు ఇంటితో పాటు విద్యను అందించాలని దాదాపుగా తీర్మానించుకున్నారు.

ఇలా అనుకున్నదే తడవుగా.. కృష్ణ తేజ రంగంలోకి దిగిపోయారు. ముందుగా పిల్లలకు విద్యను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయా విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి పిల్లలకు విద్య అందే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక ఆ పిల్లలకు ఇళ్లను కట్టించి ఇవ్వాల్సిన పని మిగిలి ఉంది. ప్రభుత్వం తరఫున ఏ మేర సాయం చేయాలో అంతదాకా చేసిన కృష్ణ తేజ… మిగిలిన నిధులను విరాళాల రూపంలో సేకరించే పనికి పూనుకున్నారు. తనకు తెలిసిన వారు, స్నేహితులు, సహోద్యోగులు… ఇలా అవకాశం ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకున్న ఆయన 292 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించారు. ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే దశల వారీగా 286 మంది అనాథ పిల్లలకు ఇళ్లను అందజేశారు. చివరగా మిగిలిపోయిన 6 ఇళ్లను పూర్తి చేసి వాటిని కూడా శనివారం పిల్లలకు అందజేశారు. ఈ క్రమంలో ఈ పని పూర్తి కాకుండానే ఏపీకి వచ్చిన కృష్ణ తేజ… ఇక్కడికి వచ్చినా… తాను అనుకున్న పనిని మాత్రం పూర్తి చేసే విషయాన్ని మాత్రం మరువకపోవడం గమనార్హం. మొత్తం 292 మంది పిల్లలకు విద్య, ఇళ్లను అందించానని, అందుకు తోడ్పాటు అందించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.