తగ్గేదే లే.. ఇక పై ‘ఎక్స్’ నా స్టేజీ: పృథ్వీరాజ్

టాలీవుడ్ లో థర్డ్ ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ తో సాగుతున్న హాస్య నటుడు పృథ్వీరాజ్ రాజకీయ విమర్శలు చేసే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా సాగుతున్నారు. ఇటీవల యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం లైలా ప్రీ రిలీజ్ వేడుక వేదికపై మాట్లాడిన పృథ్వీరాజ్.. ఏపీలో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ సెటైరిక్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తానో పాత్ర చేస్తున్నానని, తనకు ఇద్దరు బావమరదులు ఉంటారని… వారి వద్ద ఉన్న గొర్రెలు 151 అయితే …సినిమా చివరకు వాటి సంఖ్య 11కి చేరుతుందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే… వైసీపీ సోషల్ మీడియా భగ్గుమంది. తమ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యనే హేళన చేస్తూ పృథ్వీ ఆ వ్యాక్యలు చేశారని ఆరోపించింది.

ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారగా… సినిమా రిలీజ్ కు ఓ రోజు ముందు పృథ్వీ క్షమాపణ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలోనూ గోదావరి జిల్లాలకు చెందిన వారం కదా… వెటకారం తనకు మహా ఇష్టమంటూ తెలపారు. ఇకపై సినిమా వేదికల మీద తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని కూడా ఆయన తెలిపారు. తాజాగా ‘ఎక్స్’ గా పేరు మార్చుకున్న ట్విట్టర్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చేశారు. ఇకపై ఈ వేదిక మీదుగానే తాను తన అభిప్రాయాలను చెబుతానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పృథ్వీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టులో పృథ్వీ ఏమంటారంటే.. ”హాయ్.. నేను మీ థర్టీ ఇచర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ని. నేను అధికారికంగా ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను నా భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఎక్స్ అనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్ఛని తెలియపరుస్తాను” అంటూ ఆయన తెలిపారు. గతంలో వైసీపీలో కీలక నేతగా సాగిన పృథ్వీ… టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ గా వ్యవహరించారు. అయితే ఆయనపై పలు వివాదాలు రాగా.. ఆ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన పృథ్వీ జనసేనలో చేరిపోయారు.